శేఖర్ కమ్ముల 'గోదావరి'కి 10 ఏళ్లు
- IndiaGlitz, [Thursday,May 19 2016]
2004నాటి వానాకాలంకి 'కాఫీలాంటి సినిమా' అంటూ 'ఆనంద్' రూపంలో తెలుగు ప్రేక్షకుల ముందుకు ఓ కొత్త ప్రయత్నాన్ని తెచ్చి సైలెంట్ హిట్ కొట్టిన ఘనత క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ములది. ఆ తరువాత 2006 సమ్మర్‌లో 'ఈ వేసవి చాలా చల్లగా ఉంటుంది' అంటూ 'గోదావరి'ని ప్రేక్షకుల ముందుకు తెచ్చి మరో విజయాన్ని తన సొంతం చేసుకున్నారు. 1973 నాటి బాపు 'అందాల రాముడు'ని స్ఫూర్తిగా తీసుకుని కమ్ముల రూపొందించిన ఈ చిత్రం వినసొంపైన పాటలు, కనువిందైన దృశ్యాలతో గోదావరిలో పడవ ప్రయాణంలా చాలా ఆహ్లాదంగా ఉంటుంది.
సుమంత్, కమలిని ముఖర్జీ నటన, కె.ఎం.రాధాకృష్ణన్ సంగీతం, విజయ్ సి.కుమార్ ఛాయాగ్రహణం, శేఖర్ కమ్ముల దర్శకత్వం.. ఇలా అన్ని అంశాలు చక్కగా కుదిరాయి ఈ సినిమాకి. 'నంది' పురస్కారాల విషయంలో 'ద్వితీయ ఉత్తమ చిత్రం'గా నిలవడమే కాకుండా 'ఉత్తమ సంగీత దర్శకుడు'గా కె.ఎం.రాధాకృష్ణన్, 'ఉత్తమ దర్శకుడు'గా శేఖర్ కమ్ముల, 'ఉత్తమ ఛాయాగ్రాహకుడు'గా విజయ్ సి.కుమార్, 'ఉత్తమ గాయని'గా సునీత (అందంగా లేనా) కి అవార్డులు అందించిన ఘనత 'గోదావరి'ది. 2006లో మే 19న విడుదలైన 'గోదావరి' నేటితో 10 వసంతాలను పూర్తిచేసుకుంటోంది.