మణిరత్నం సినిమాలో మరోసారి..

  • IndiaGlitz, [Saturday,February 03 2018]

అదితి రావు హైదరీ.. హిందీ సినిమాలు చూసే తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. గ‌తేడాది మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన త‌మిళ అనువాద చిత్రం చెలియా'తో.. ఇక్క‌డివారికి మ‌రింత ద‌గ్గ‌ర‌య్యింది ఈ హైద‌రాబాదీ ముద్దుగుమ్మ‌. ఆ సినిమా ఎలా వున్నా...అదితి లుక్స్‌కి ఫిదా అయిపోయారు తెలుగు, తమిళ ప్రేక్షకులు. ఇప్పటికే మలయాళం, తమిళంలో నటించిన ఈ భామ.. ప్ర‌స్తుతం సుధీర్ బాబుకి జోడీగా ఓ తెలుగు సినిమా చేస్తోంది.

అంతేగాకుండా, వెంకటేష్, తేజ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీలో కూడా ఈ అమ్మడు నటించబోతున్నట్టు ఆ మ‌ధ్య మీడియాలో వార్తలు వినిపించాయి. కొన్ని కార‌ణాల వ‌ల్ల అదితి ఇప్పుడా సినిమా చేయ‌ట్లేద‌ని తెలిసింది. ఇదిలా వుంటే...ప్రస్తుతం హిందీలో దాస్ దేవ్' మూవీలో నటిస్తున్న అదితి...ఈ మూవీ ప్రమోషన్‌లో భాగంగా ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టింది.

మణిరత్నం తమిళంలో రూపొందిస్తున్న ఒక కుటుంబకథా చిత్రంలో శింబు సరసన హీరోయిన్‌గా నటించబోతున్నట్టు తెలిపింది. మల్టీస్టారర్ మూవీగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్, అరవింద్ స్వామి, జయసుధ, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్ర‌ల్లో నటిస్తున్నారు. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా, ఇటీవల విడుదలైన పద్మావత్' మూవీలో మెహరున్నిసా పాత్రలో అదితి నటించిన విషయం తెలిసిందే.