‘శ్రీకారం’ టీజర్ : ఈ ఒక్క‌టీ.. జ‌వాబులేని ప్ర‌శ్న‌గానే మిగిలిపోయింది

  • IndiaGlitz, [Tuesday,February 09 2021]

యంగ్ హీరో శ‌ర్వానంద్, క్యూట్‌ బ్యూటీ ప్రియాంకా అరుళ్‌ మోహన్‌ హీరోహీరోయిన్లుగా న‌టిస్తోన్న చిత్రం 'శ్రీ‌కారం'‌. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేశారు. ఒక హీరో త‌న కొడుకుని హీరోని చేస్తున్నాడు.. ఒక డాక్ట‌ర్ త‌న కొడుకుని డాక్ట‌ర్‌ని చేస్తున్నాడు.. ఒక ఇంజ‌నీర్ త‌న కొడుకుని ఇంజ‌నీర్‌ని చేస్తున్నాడు.. కానీ ఒక రైతు మాత్ర‌మే త‌న కొడుకుని రైతుని చేయ‌డం లేదు. ఈ ఒక్క‌టీ.. నాకు జ‌వాబులేని ప్ర‌శ్న‌గానే మిగిలిపోయింది’’.. ‘‘తినేవాళ్లు మ‌న నెత్తిమీద జుట్టంత ఉంటే, పండించేవాళ్లు మూతిమీద మీస‌మంత కూడా లేరు’’ అనే డైలాగ్స్‌తో ఈ టీజర్‌ను కట్ చేశారు.

మొత్తానికి టీజర్‌ను బట్టి చూస్తే మరో అద్భుతమైన కథతో శర్వానంద్ ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు తెలుస్తోంది. తన సంకల్పానికి శ్రీకారం చుట్టిన శర్వా.. వ్యవసాయాన్ని ప్యాషన్‌గా మార్చుకుని ఎలా సక్సెస్ అయ్యాడనేదే ఈ సినిమా కథ అని తెలుస్తోంది. ఇక ఈ చిత్ర కథనం ఎలా ఉందనేదే ఆసక్తికరంగా మారింది. శర్వా సినిమాలంటేనే ఫ్యామిలీ మొత్తం కలిసి చూసేలా ఉంటాయి. ఈ సినిమా కూడా అదే కోవకు చెందినదనడంలో సందేహం లేదు. కిశోర్ బి. డైరెక్ట్ చేస్తోన్న ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ని 14 రీల్స్ ప్ల‌స్‌ బ్యాన‌ర్‌పై రామ్ ఆచంట‌, గోపి ఆచంట నిర్మిస్తున్నారు.

ఈ చిత్ర టీజర్‌ను ట్విట్టర్ ద్వారా విడుదల చేసిన మహేష్... టీజ‌ర్ చాలా ఆస‌క్తిక‌రంగా ఉంద‌నీ, సినిమా ఘ‌న విజ‌యం సాధించాల‌ని ఆకాంక్షిస్తూ.. మొత్తం టీమ్‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. మ‌హాశివ‌రాత్రి కానుక‌గా మార్చి 11న 'శ్రీ‌కారం' థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది. ఈ టీజర్‌‌తో సినిమాపై అంచనాలను భారీగా పెంచేశారు. నిజ జీవిత ఘ‌ట‌న‌ల స్ఫూర్తితో ఈ సినిమాని రూపొందించిన‌ట్లు మేకర్స్‌ పేర్కొన్నారు. హీరో శ‌ర్వానంద్ చెప్పిన‌ రెండు డైలాగ్స్ ఆయ‌న క్యారెక్ట‌రైజేష‌న్‌ను వెల్ల‌డిస్తున్నాయి. మొత్తానికి తండ్రి ఆశయాన్ని నిలబెట్టడంలో శర్వా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడు వంటి ఆసక్తికర అంశాలతో సినిమా రూపొందినట్టు తెలుస్తోంది.