శతమానం భవతి కొత్త కథ కాదు కానీ....అది మాత్రం గ్యారెంటీ - శర్వానంద్..!
- IndiaGlitz, [Thursday,January 12 2017]
రన్ రాజా రన్, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, ఎక్స్ ప్రెస్ రాజా....ఇలా వరుస విజయాలతో హ్యాట్రిక్ సాధించిన యువ హీరో శర్వానంద్. వేగేశ్న సతీష్ దర్శకత్వంలో శర్వానంద్ నటించిన తాజా చిత్రం శతమానం భవతి. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రంగా రూపొందిన శతమానం భవతి సంక్రాంతి కానుకగా ఈ నెల 14న రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా శతమానం భవతి హీరో శర్వానంద్ తో ఇంటర్ వ్యూ మీ కోసం...!
ఈ సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలతో పోటీ పడుతున్నారు కదా...! టెన్షన్ పడుతున్నారా..?
గత సంవత్సరం సంక్రాంతికి మూడు పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ సంవత్సరం పెద్ద సినిమాలు రెండు రిలీజ్ అయ్యాయి. అయినా సంక్రాంతికి మూడు పెద్ద సినిమాలు వచ్చినా ప్రేక్షకులు చూస్తారు. అందుచేత ఎలాంటి టెన్షన్ లేదు.
ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది..?
కథలో భాగంగా ఉంటాను. తాతయ్య ఆలోచనలకు వారసుడుగా ఉంటాను. ఆనందాన్ని పది మందికి పంచితే బాగుంటుంది అని ఆలోచించేలా నా క్యారెక్టర్ ఉంటుంది.
కథలో ఉన్న కొత్తదనం ఏమిటి..?
ఇదేదో కొత్త కథ... కొత్త పాయింట్ అని చెప్పను. ఎందుకంటే మనందరికీ తెలిసిన పాయింటే. కాకపోతే సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ఫీల్ గుడ్ మూవీ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. అలాగే సినిమా చూసిన తర్వాత తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాట్లాడతారు ఇది మాత్రం గ్యారెంటీ.
డైరెక్టర్ వేగేశ్న సతీష్ రైటర్ గా చాలా సినిమాలకు వర్క్ చేసారు కదా. ఆయనతో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ గురించి..?
డైరెక్టర్ సతీష్ రైటర్ కాబట్టి స్ర్కిప్ట్ పై ఫుల్ క్లారిటీ ఉంది. బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి సీన్ గురించి క్లారిటీ ఉంది. క్లారిటీ ఉండడం వలనే అనుకున్న ప్రకారం అనుకున్న విధంగా షూటింగ్ పూర్తి చేసారు.
మీరు ఇప్పటి వరకు చేసిన చిత్రాలతో పోల్చితే కాస్త డిఫరెంట్ మూవీ కదా..! ఈ సినిమాతో మీకు ఫ్యామిలీ ఆడియోన్స్ లో మంచి గుర్తింపు వస్తుంది అనుకుంటున్నారా..?
ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియోన్స్ లో మంచి పేరు వస్తుంది అనే నమ్మకం ఉంది.
ఈ సినిమాకి హీరోగా రాజ్ తరుణ్, సాయిధరమ్ తేజ్ అనుకున్నారు. ఆతర్వాత మీ దగ్గరకి వచ్చింది. వాళ్లు నో చెప్పడానికి... మీరు ఓకే చెప్పడానికి కారణం ఏమిటి..?
నాకు తేజు ఫోన్ చేసి ఈ సినిమా చేయ్ బాగుంటుంది అని చెప్పాడు. కథ నాకు నచ్చింది చేసాను.
ఈ సినిమాలో మీ క్యారెక్టర్ కాకుండా మిగిలిన క్యారెక్టర్స్ లో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్..?
నరేష్ గారి క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది. అలాంటి క్యారెక్టర్ చేయడం చాలా కష్టం. ఆయన గెటప్ కూడా బాగుంటుంది.
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గురించి చెప్పండి..?
పెంటాస్టిక్ ఏక్టరస్. తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకుంది. పాత్రకు తగ్గట్టు చాలా బాగా నటించింది.
శతమానం భవతి పాటలకు చాలా మంచి స్పందన లభిస్తుంది. మీకు నచ్చిన పాట ఏమిటి..?
మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అదరగొట్టేసాడు. శతమానం భవతి అనే సాంగ్ నా ఫేవరేట్ సాంగ్. ఈ చిత్రంలో బాలు గారు ఓ పాట పాడారు. ఫస్ట్ టైమ్ బాలు గారు నాకు పాట పాడడం. అది ఈ సినిమాకి జరగడం చాలా సంతోషంగా ఉంది.
ఇంతకీ..పెళ్లి ఎప్పుడు..?
ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదు. ఎప్పుడు జరగాలి అని రాసి ఉంటే అప్పుడు జరుగుతుంది.
నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి...?
బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ గారి బ్యానర్ లో చేస్తున్న సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. రిలీజ్ ఎప్పుడు అనేది త్వరలో ఎనౌన్స్ చేస్తాం. ఈ సంవత్సరం మూడు సినిమాలు రిలీజ్ చేయాలి అనుకుంటున్నాను.