నా కెరీర్ లో డిఫరెంట్ సినిమా 'రాధ' : శర్వానంద్

  • IndiaGlitz, [Tuesday,May 16 2017]

సక్సెస్ ఫుల్ హీరో శర్వానంద్ తన సక్సెస్ స్ట్రీక్ ను కొనసాగిస్తూ కొట్టిన మరో హిట్ "రాధ". యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ హిలేరియస్ మూవీని ఎస్.వి.సి.సి పతాకంపై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించారు. యువ ప్రతిభాశాలి చంద్రమోహన్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవ్వడం విశేషం. మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొంటూ విజయపధంలో దూసుకుపోతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని చిత్ర బృందం హైద్రాబాద్ లో సక్సెస్ మీట్ ను నిర్వహించింది. చిత్ర బృంద సభ్యులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
చిత్ర దర్శకుడు చంద్రమోహన్ మాట్లాడుతూ.. "ఫ్యామిలీ ఆడియన్స్ మా చిత్రాన్ని బాగా ఆదరిస్తున్నారు. సమ్మర్ కి సరైన సినిమా అంటూ అభినందిస్తున్నప్పుడు ఎక్కడలేని ఆనందంతో ఉప్పొంగిపోయాను. కానీ.. సినిమా అప్పుడే పైరసీ అయిపోయి ఇంటర్నెట్ లో లభ్యమవుతుండడం బాధగా అనిపించింది. లేడీ ఆడియన్స్ చిత్రాన్ని విశేషంగా ఆదరిస్తుండడం మాకు గర్వంగా ఉంది." అన్నారు.
కమెడియన్ సప్తగిరి మాట్లాడుతూ.. ""ఎక్స్ ప్రెస్ రాజా" తర్వాత శర్వానంద్ కాంబినేషన్ లో చేసిన సినిమా "రాధ". "నాన్నకు ప్రేమతో" స్పూఫ్ ను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ గారి బ్యానర్ లో మరిన్ని సినిమాలు చేయాలని, అలాగే శర్వానంద్ గారితో మరిన్ని చిత్రాల్లో నటించి ఇలాగే సూపర్ హిట్ లు కొట్టాలని కోరుకొంటున్నారు" అన్నారు.
చిత్ర నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ.. "మా చిత్రానికి ఇంతటి ఘన విజయాన్ని అందించినందుకు తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. పోలీస్ క్యారెక్టరైజేషన్ సినిమాకి హైలైట్ గా నిలిచింది. మాకు సపోర్ట్ చేస్తున్నవారందరికీ పేరుపేరుణా కృతజ్నతలు తెలుపుతున్నాను" అన్నారు.
చిత్ర కథానాయకుడు శర్వానంద్ మాట్లాడుతూ.. "శర్వా సినిమా అనగానే కుటుంబాలతో కలిసి థియేటర్లకు తరళివస్తున్నందుకు ప్రేక్షకులకు కృతజ్నతలు. "రాధ" చిత్రాన్ని అందరూ రెగ్యులర్ సినిమా అంటున్నారు కానీ.. నా కెరీర్ లో డిఫరెంట్ సినిమా ఇది. "రాధ" లాంటి మంచి హిట్ ఇచ్చినందుకు నా డైరెక్టర్ చంద్రమోహన్ కి ధన్యవాదాలు. మొన్న థియేటర్ కి వెళ్లినప్పుడు సెకండాఫ్ లో సప్తగిరి కామెడీకి జనం చప్పట్లు కొడుతూ నవ్వుతున్నారు. ప్రతి ఒక్కరి పాత్ర కూడా విశేషమైన రీతిలో ప్రేక్షకులను అలరిస్తుంది. మాకు సపోర్ట్ గా నిలిచిన మీడియా మిత్రులకు ఈ సందర్భంగా థ్యాంక్స్ చెబుతున్నాను" అన్నారు.