డబ్బులొస్తున్నాయి... కానీ! - శర్వానంద్
- IndiaGlitz, [Saturday,August 17 2019]
శర్వానంద్, కాజల్, కల్యాణి ప్రియదర్శిని కీలక పాత్రల్లో నటించిన చిత్రం 'రణరంగం'. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది. సుధీర్ వర్మ దర్శకుడు. ఈ సినిమా గురువారం విడుదలైంది. ఈ సినిమా గురించి హీరో శర్వానంద్ హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు.
సినిమా ఎలా ఉంది?
చూసిన వాళ్లు ఎవరూ బాగోలేదని మాత్రం అనలేదు.
ఈ రిజల్ట్ ఎక్స్ పెక్ట్ చేశారా?
ఇంకా బెటర్‌గా ఎక్స్ పెక్ట్ చేశా.
టాక్‌కీ, కలెక్షన్లకీ సంబంధం లేదేమో..
ఒక విధంగా ఆనందంగా ఉంది. మరో విధంగా రివ్యూలవీ... బాగా వచ్చి ఉంటే బావుండేదనిపించింది.
రవితేజ కోసం చేసిన స్క్రిప్ట్ ఇది. మీకు ఏం నచ్చి మీరు చేస్తానన్నారు?
స్క్రీన్‌ప్లే నచ్చింది. మామూలుగా కామెడీ, ఫ్యామిలీ స్క్రిప్టులతో రొటీన్‌గా సినిమాలు చేస్తున్నట్టు ఆ మధ్య అనిపించింది. దాన్నుంచి బయటపడటానికి స్టైలైజ్డ్ మేకింగ్‌తో చేసిన సినిమా ఇది. యాక్టర్‌గా చాలెంజింగ్‌గా ఉంటుందనుకున్నా. రిలీజ్ అయ్యాక ఎవరు సినిమా చూసినా 'చాలా బాగా చేశావు. చాలా బావున్నావు' అని అన్నారు.
గ్యాంగ్‌స్టర్‌గా చేయాలనిపించిందా?
అలాగనేం కాదు. నాకు ఈ చిత్రంలో రెండు వేరియేషన్స్ ఉన్నాయి. పైగా ఇంత యాక్షన్ సినిమా కూడా నేనెప్పుడూ చేయలేదు. ఆడియన్స్ కి కూడా కొత్తగా ఉంటుందనిపించి చేశా.
బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరిచ్చారు?
సురేఖ ఆంటీ ఫోన్ చేసి 'చాలా అందంగా ఉన్నావు' అని కాంప్లిమెంట్ ఇచ్చారు.
మీకు పర్సనల్‌గా నచ్చిన కేరక్టర్ ఏంటి?
యంగ్ కేరక్టర్ బాగా నచ్చింది. ఘరానా మొగుడు, అల్లుడా మజాకా వంటి కొన్నిటిని ఓన్ చేసుకుని, చిరంజీవిగారిని దృష్టిలో పెట్టుకుని కూడా చేశా.
సినిమాలో కేరక్టర్‌ని జస్టిఫై చేశామని అనుకున్నారా?
అసలు సుధీర్ జస్టిఫై చేయదలచుకోలేదు. ఒకవేళ జస్టిఫై చేస్తే ఆ క్యారక్టర్ ఎవరు? ఏంటి? ఎవరికోసం చేస్తున్నాడు? వంటివన్నీ తీసుకుంటే, అది వేరే స్టోరీ అయిపోతుందనుకున్నాం. కానీ అది బ్యాక్ ఫైర్ అయింది. కాకపోతే చూపించి ఉంటే పోయుండేదేమో.
ఇప్పటి రియలైజేషన్ కమింగ్ స్క్రిప్ట్ ల్లో కనిపిస్తుందా?
రియలైజేషన్ అంటే అండీ... ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ ఒకలా ఉంది. సినిమా వాళ్ల నుంచి మరోలా ఉంది. విజయవాడ నుంచి కొంతమంది ఫోన్ చేసి 'మీరు ఇలాంటి కథలే చేయండి' అని అడుగుతున్నారు. సో నేను కన్ఫ్యూజన్లో ఉన్నా. అందుకే ఇంకొన్నాళ్ల తర్వాత ఏది కరెక్టో ఆలోచిస్తా. రెవెన్యూని చూసిన తర్వాత డిసైడ్ అవుతాను.
ఏదేమైనా మీరు హ్యాపీగా లేరని అర్థమవుతోంది...
నేను కలెక్షన్లతో హ్యాపీగా ఉన్నా. రివ్యూలు కూడా బావుంటే బావుండేదనిపించింది.
నెక్స్ట్ కథల గురించి..?
'96' చేస్తున్నా. 'శ్రీకారం' అని ఓ చిత్రం చేస్తున్నా. అద్భుతమైన కథ అది. ఈ రెండు సినిమాలు స్టోరీగా కూడా మంచి కథలు. కమర్షియల్‌గా ఎంత వరకు ఉంటుందో నాకు తెలియదు. 'శతమానంభవతి' చేసినప్పుడు కూడా నాకు నటించడానికి పెద్దగా ఏమీ ఉండదని తెలుసు. అయినా మంచి కథ అని చేశా. ఇవి కూడా అంతే. నెక్స్ట్ తమిళ్, తెలుగులో ఓ సినిమా చేస్తున్నా.
స్క్రిప్ట్ లు ఎంపిక చేసుకోవడం కష్టమా?
- చాలా కష్టమండీ. ఎందుకంటే ఒక సినిమా చేస్తాం. హిట్ అయిందనుకోండి. ఆ తర్వాత కూడా అలాంటి సినిమాలే చేయాలా? ఇంకేమైనా కొత్తవి చేయాలా? అనేది ఉంటుంది. ఒకవేళ సినిమా ఆడలేదనుకోండి.. అంతకు ముందు అంగీకరించిన వాటిని ఏం చేయాలి?.. ఇలాంటి సందిగ్ధం ఉంటుంది.
'రణరంగం' ప్రొడక్షన్ వేల్యూస్ గురించి చెప్పండి?
ఈ నిర్మాతలు ఏం చేసినా, చాలా బాగా చేస్తారండీ. ఈ సినిమాతో నాకు వంశీ మంచి ఫ్రెండ్ అయ్యాడు. అంతకు ముందు చినబాబుగారితో మా నాన్నగారికి, బాబాయ్‌లకు మంచి ఫ్రెండ్షిప్ ఉండేది. మంచి సినిమా చేయమని చినబాబుగారు అన్నారు.