Sharmila: దిమ్మతిరిగేలా, మాడుపగిలేలా సుప్రీంకోర్టు తీర్పు: షర్మిల
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలో పోలింగ్ ముగిసే దాకా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎక్స్ వేదికగా ఫుల్ యాక్టివ్‌గా ఉండేవారు. ఆమె చేసే ప్రతి ప్రచారం కార్యక్రమం వివరాలతో పాటు వైసీపీ ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు చేస్తూ ట్వీట్స్ చేసేవారు. అయితే పోలింగ్ ముగిశాక కొద్దిగా సైలెంట్ అయ్యారు. తాజాగా ఓ ట్వీట్ చేశారు. దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు గురించి మాట్లాడవద్దంటూ కడప కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే విధించింది. ఈ నేపథ్యంలో షర్మిల ట్వీట్ చేస్తూ ఈ విజయం తొలి అడుగు మాత్రమేనని పేర్కొన్నారు.
"దురాత్ముల నీచబుద్ధికి దిమ్మతిరిగేలా, మాడుపగిలేలా, వివేకానందరెడ్డి గారి హత్య విషయంలో నిన్న సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. భావప్రకటన స్వేచ్ఛపై ఈ రాక్షస మూక చేయబోయిన దాడిని తిప్పికొట్టి, ఎప్పటికైనా ధర్మపోరాటంలో చివరికి న్యాయమే గెలుస్తుందని నిన్న నిరూపణ అయ్యింది. అధికార బలాన్ని ఉపయోగించి, మూర్ఖత్వంతో ఇలాంటి చిల్లర కుట్రలు చేసేవారికి ఈ స్టే చెంపపెట్టు. ఈ విజయం తొలి అడుగు మాత్రమే. రాబోయే రోజుల్లో, వివేకానందరెడ్డి గారి కుటుంబానికి న్యాయం కోసం పోరాటం ఉధృతం చేస్తాము. చిట్టచివరిగా విజయం, నిజం, న్యాయం వైపే ఉంటాయని చూపిస్తాం" అంటూ ట్వీట్ చేశారు.
కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసిన వైఎస్ షర్మిల.. వైసీపీ ఓఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. వివేకా హత్యకేసు నిందితులను చట్టసభల్లోకి వెళ్లనీయకూడదనే ఉద్దేశంతోనే తాను కడప నుంచి పోటీచేస్తున్నట్లు ప్రకటించారు. ఇలా తన ప్రచారం మొత్తం వివేకా హత్యకేసుపైనే ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో కోర్టు విచారణలో ఉన్న అంశంపై బహిరంగ వ్యాఖ్యలు సరికాదంటూ వైసీపీ నేతలు కడప కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ విచారించిన న్యాయస్థానం వివేకా హత్యకేసు గురించి మాట్లాడవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది.
దీంతో కడప జిల్లా కోర్టు తీర్పును షర్మిల సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దీనిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం.. కడప కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కడప కోర్టు ఉత్తర్వులు వాక్ స్వాతంత్రం, స్వేచ్ఛను హరించేలా ఉన్నాయని అభిప్రాయపడింది. ప్రతివాదుల వాదన వినకుండా ఏకపక్షంగా ఉత్తర్వులు ఇచ్చారంటూ.. ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను వేసవి సెలవుల తర్వాత చేపడతామని వెల్లడించింది. పేర్కొంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ షర్మిల ట్వీట్ చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com