షర్మిల రాజకీయ పార్టీ.. జగన్‌కు పెద్ద దెబ్బే..
Send us your feedback to audioarticles@vaarta.com
దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి కుమార్తె, ప్రస్తుత సీఎం జగన్మోహన్‌రెడ్డి సోదరి షర్మిల తెలంగాణలో నూతన పార్టీ పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పుడు ఈమె పార్టీ ప్రకటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. తెలంగాణ విషయం అటుంచితే ఏపీ పరిస్థితేంటి? షర్మిల రాజకీయ పార్టీ ప్రకటనపై ఇప్పటి వరకూ ఆమె అన్న జగన్ పెదవి విప్పలేదు. అసలు తనకు ఏమాత్రం సంబంధం లేదు అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించినప్పటికీ అన్నాచెల్లెల్ల మధ్య విభేదాలున్నాయనే విషయాన్ని పరోక్షంగా వెల్లడించారు. ప్రస్తుతం షర్మిల పార్టీ పెట్టబోవడం వెనుక జగన్ ఉన్నారా? లేదా? అనే విషయం పక్కనబెడితే దీని కారణంగా ఆయనకు పరోక్షంగా దెబ్బ పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
షర్మిల రాజకీయ పార్టీ ఏర్పాటు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆమెకు రాజకీయాలపై పెద్దగా ఆసక్తి లేదేమో అని ప్రజానీకం ఇప్పటి వరకూ భావిస్తూ వచ్చారు. ఒకానొక సమయంలో రాజకీయ ప్రచారం నిర్వహించినప్పటికీ అది తన అన్న కోసం మాత్రమేనని సర్ది చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు ఆమె పార్టీ పెట్టే స్థాయికి వెళ్లారంటే ఆమెకు రాజకీయాలపై అమితాసక్తి ఉందని అర్థమవుతోంది. మరి అలాంటప్పుడు అన్న స్థాపించిన పార్టీ.. అన్న జైలుకెళితే అంతా తానై నిలబెట్టిన పార్టీలో ఆమె ఇమడలేకపోయారా? లేదంటే పార్టీయే ఆమెను పక్కనబెట్టేసిందా? అనే చర్చ సర్వత్రా జరుగుతోంది. తన తండ్రికి అండగా నిలిచిన ఎందరికో పిలిచి మరీ పదవులిచ్చిన జగన్.. తన సొంత చెల్లిని మాత్రం ఎందుకు పక్కనబెట్టాల్సి వచ్చిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2019 ఎన్నికల తర్వాత షర్మిల తిరిగి ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడు సడెన్‌గా పార్టీ ప్రకటన. ఈ మధ్య కాలంలో అసలేం జరిగిందనేది ప్రశ్నార్థకంగా మారింది.
టీడీపీ అధినేత చంద్రబాబును విమర్శించాల్సి వస్తే మొదటగా ఆయన తన మామకు వెన్నుపోటు పొడిచారంటూ వైసీపీ నేతలు మొదలు పెట్టేవారు. ఇప్పుడు షర్మిల అంశం ప్రతిపక్షానికి మంచి అస్త్రమయ్యే అవకాశమూ లేకపోలేదు. అధికారంలో ఉన్న జగన్‌కు షర్మిలకు సముచిత స్థానాన్నివ్వడం పెద్ద విషయమేమీ కాదు. అయినా కూడా ఆయన ఆ పని చేయలేదు. అత్యవసర పరిస్థితుల్లో పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన ఆమెను పూర్తిగా పక్కనబెట్టేశారు. ఇది జగన్‌ను డిఫెన్స్‌లో పడేసే అవకాశం ఉందని తెలుస్తోంది. సొంత చెల్లెలిని కూడా జగన్ మోసం చేశారనే విమర్శలు వచ్చే అవకాశం ఉంది. షర్మిల సైతం తెలంగాణలోని లోటస్‌పాండ్‌లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఎక్కడా కూడా అన్న ఫోటో కనబడనివ్వలేదు. దీంతో అన్నపై ఆమె ఒకింత కోపంతో ఉన్నారని చెప్పకనే చెప్పినట్టు అయిందని చర్చ జరుగుతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments