నేనెందుకు పార్టీ పెట్టకూడదు.. రాజన్న రాజ్యం తెస్తా: షర్మిల

  • IndiaGlitz, [Tuesday,February 09 2021]

తెలంగాణలోని వైఎస్సార్ అభిమానులు, కార్యకర్తలు, అనుచరులతో వైఎస్ షర్మిల మంగళవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. తెలంగాణలో పార్టీని నెలకొల్పబోతున్నారనే ప్రచారం జోరందుకున్న సమయంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత నెలకొంది. మొదట నల్గొండ జిల్లాకు చెందిన కీలక నేతలతో నేడు షర్మిల సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె కార్యకర్తలు, నేతలతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆదిలోనే షర్మిల తన మాటలతో అభిమానులను ఆకట్టుకున్నారు. ‘రాజన్నను అభిమానించే ప్రతి గుండెకు.. రాజన్న బిడ్డ శిరసు వంచి, చేతులు జోడించి నమస్కారం తెలియజోస్తోంది’ అనగానే అభిమానుల్లో సంతోషం పెల్లుబికింది.

నేనిక్కడ మాట్లాడటానికి రాలేదు..

ఇంకా షర్మిల మాట్లాడుతూ... తానిక్కడికి మాట్లాడటానికి రాలేదని.. కార్యకర్తలు చెప్పింది వినడానికి మాత్రమే వచ్చానని తెలిపారు. రాజన్న బిడ్డ పిలవగానే వచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజస్తున్నానన్నారు. రాజన్న రాజ్యంలో ప్రతిరైతు రాజులా బతికారని.. రాజన్న రాజ్యం మళ్లీ రావాలన్నారు. రాజన్న రాజ్యం తనతోనే సాధ్యమని తమ నమ్మకమన్నారు. రాజన్న రాజ్యంలో ప్రతి పేదవాడికి ఒక పక్కా ఇల్లు ఉండాలని కలలు కన్నారన్నారు. పేదరికం అన్నది ఒక శాపమని.. దాన్ని రూపుమాపడానికి తన తండ్రి శ్రమించారని వెల్లడించారు. పేదవాడి కోసం ఆరోగ్య శ్రీ తెచ్చారన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయని షర్మిల పేర్కొన్నారు.

ఆత్మీయ సమ్మేళనానికి ముందు..

అభిమానులతో ఆత్మీయ సమ్మేళనానికి ముందు షర్మిల మాట్లాడుతూ.. ‘వైఎస్సార్‌లేని లోటు తెలంగాణలో ఉందన్నారు. తెలంగాణలో రాజన్న రాజ్యం లేదన్నారు. ఎందుకు అలా లేదన్నదే తన ఆలోచన అని పేర్కొన్నారు. ‘నేను ఎందుకు రాకూడదు.. ఎందుకు పార్టీ పెట్టకూడదు. అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నాను. కచ్చితంగా తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తాం. అభిమానులకు చెప్పకుండా నేను పార్టీ పెట్టను. అందరితోనూ మాట్లాడే నా నిర్ణయాన్ని ప్రకటిస్తాను’ అని షర్మిల చెప్పారు. మరోవైపు.. అభిమానులు, అనుచరులతో లోటస్‌పాండ్‌‌లో సందడి నెలకొంది. వైఎస్ అభిమానులు భారీగా అక్కడకు చేరుకుని ‘జై షర్మిల.. జై జై షర్మిల’ నినాదాలు చేశారు.