తండ్రి పాలనతో పోలుస్తూ కేసీఆర్‌ను దుయ్యబట్టిన షర్మిల
- IndiaGlitz, [Saturday,April 10 2021]
నేడు వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో ఖమ్మంలో సంకల్ప సభ ఘనంగా జరిగింది. ఈ సభలో షర్మిల తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనతో పోలుస్తూ నేటి సీఎం కేసీఆర్‌ను తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. సంకల్ప సభలో షర్మిల మాట్లాడుతూ.. ప్రాజెక్టుల్లో కేసీఆర్ అవినీతి అంతులేనిదని.. దానిని ప్రశ్నించేందుకే తమ పార్టీ అవసరమన్నారు. ఒకవైపు తెలంగాణలో రైతులు ఎన్నో కష్టాలు పడుతుంటే.. వారి పేరుతో అప్పులు తెచ్చి పాలకులు జేబులు నింపుకుంటున్నారన్నారు. మహిళలు లక్షాధికారులు కావాలని వైఎస్ కలలు కన్నారన్నారు. కేసీఆర్ చెప్పిన కేజీ టు పీజీ విద్య ఏమైందని షర్మిల ప్రశ్నించారు.
ప్రైవేట్ రంగంలోనూ వైఎస్ 11 లక్షల ఉద్యోగాలు కల్పించారని, ఇప్పుడు యువతకు ఉద్యోగాలు లేవన్నారు. నిరుద్యోగ భృతి ఏమైందని షర్మిల కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీశారు. వైఎస్ హయాంలో 46 లక్షల పక్కా ఇళ్లు కట్టించారని.. కేసీఆర్ ఇప్పటి వరకు ఎన్ని ఇళ్లు కట్టించారో చెప్పాలని ప్రశ్నించారు. ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు అన్నారని.. అది ఏమైందని నిలదీశారు. అడిగిన ప్రతి ఒక్కరికి వైఎస్ తెల్లరేషన్ కార్డు ఇచ్చారని.. అలాగే 108 అంబులెన్స్‌ల ఆలోచన వైఎస్ తప్ప ఏ నాయకుడూ చేయలేదని షర్మిల పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో ఒక్క కొత్త కార్డు సైతం రాలేదని షర్మిల దుయ్యట్టారు. కేసీఆర్ హయాంలో పెన్షన్లు లేవని, కార్పొరేషన్లకు నిధులు లేవని విమర్శించారు. దళితులకు మూడెకరాల భూమి ఏమైంది సీఎం సారూ? అని షర్మిల ప్రశ్నించారు.
విజయమ్మ భావోద్వేగం..
వైఎస్ షర్మిల నిర్వహించిన సంకల్ప సభలో ఆమె తల్లి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి విజయమ్మ భావోద్వేగానికి లోనయ్యారు. తన గొంతులో ప్రాణం ఉన్నంత కాలం.. తాను, తన కుటుంబం రుణపడి ఉంటామన్నారు. వైఎస్ మనుషుల్లో తేడాలెందుకని భావించేవారని.. అందరినీ అక్కున చేర్చుకున్న మహనీయుడని కొనియాడారు. ఎంత కాలం బతికామన్నది ముఖ్యం కాదని.. ఎలా బతికామన్నదే ముఖ్యమని వైఎస్ చెప్పిన మాటలను గుర్తుచేసుకుని విజయమ్మ భావోద్వేగానికి గురయ్యారు. 18 ఏళ్ల కిందట ఇదే రోజున తెలంగాణలో చేవెళ్ల నుంచి ప్రజాప్రస్థానం పేరుతో వైఎస్‌ఆర్ పాదయాత్ర చేపట్టారని గుర్తుచేశారు. రాజకీయ ప్రస్థానానికి తొలి అడుగు ఖమ్మం నుంచి షర్మిల వేయడం అభినందనీయమని విజయమ్మ కొనియాడారు. రాజన్న బిడ్డ పార్టీ పెడుతుంటే వస్తున్న అభినందనల వెల్లువ చెప్పలేనిదన్నారు. వైఎస్ కోసం మరణించిన వారిలో ఎక్కువగా తెలంగాణవారే ఉన్నారని విజయమ్మ తెలిపారు.