Sharmila: సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలతో షర్మిల కంటతడి
Send us your feedback to audioarticles@vaarta.com
షర్మిల రాజకీయ కాంక్షతోనే వైఎస్ కుటుంబంలో విభేదాలు వచ్చాయన్న సీఎం జగన్ వ్యాఖ్యలపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల కంటతడి పెట్టారు. ఇటీవల ఆమె గురించి జగన్ చేసిన ఆరోపణలు, విమర్శలపై షర్మిల స్పందిస్తూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
"నా రాజకీయ కాంక్ష వల్లే రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో విభేదాలు వచ్చినట్టు జగన్ వ్యాఖ్యానించారు. నా రాజకీయ కోరికను ప్రోత్సహిస్తే అది బంధుప్రీతికి దారితీస్తుందని... కుటుంబంలో కలతలకు ఇదే కారణమని చెప్పారు. ఇప్పుడు చెల్లెలిగా జగన్ మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తున్నా. నన్ను రాజకీయాల్లోకి తీసుకువచ్చింది ఎవరు?
జగన్ అరెస్ట్ అయితే 19 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు వచ్చాయి. ఆ ఉప ఎన్నికల్లో ప్రచారం చేయాలని నన్ను అడిగింది మీరు కాదా? మీరు జైలుకు వెళ్లినప్పుడు... ఓవైపు చంద్రబాబు పాదయాత్ర చేస్తున్నారు, ఆయనకు గ్రాఫ్ పెరుగుతుంది... అందుకే నన్ను కూడా పాదయాత్ర చేయాలని చెప్పింది మీరు కాదా? సమైక్యాంధ్ర కోసం, తెలంగాణలో ఓదార్పు యాత్ర, బై బై బాబు ప్రచారం కోసం ఉపయోగపడింది నేను కాదా? మీ అవసరాల కోసం మీరు నన్ను రాజకీయాల్లోకి తెచ్చింది వాస్తవం కాదా?
నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు మీరు జైల్లో ఉన్నారు... ఆ సమయంలో పార్టీ అంతా నా చుట్టూనే తిరుగుతోంది. నాకు రాజకీయ కాంక్షే ఉంటే... వైసీపీని నేను హస్తగతం చేసుకుని ఉండేదాన్ని కాదా? కానీ, జగనన్నే వస్తాడు, జగనన్న రాజ్యం వస్తుంది, రాజశేఖర్ రెడ్డిని మరిపించేలా పరిపాలిస్తాడు అని కాలికి బలపం కట్టుకుని తిరిగింది నేను కాదా? నా పిల్లలను కూడా పట్టించుకోకుండా రోడ్ల వెంబడి నెలల తరబడి తిరిగిన దాన్ని నేను కాదా? కాలికి దెబ్బ తగిలినా, వెంటనే ఫిజియో థెరపీ చేయించుకుని మీ కోసం మళ్లీ పాదయాత్రకు సిద్ధమైంది నేను కాదా? నేను ఇన్ని త్యాగాలు చేసినా నాకు రాజకీయ కాంక్ష ఉందని మీరు విమర్శిస్తున్నారు.
నాకే గనుక రాజకీయ కాంక్ష ఉంటే మీ పార్టీలోనే ఉంటూ నేను పొందాలనుకున్న పదవిని మొండిగా పొందగలను. నన్ను ఎంపీగా చేయాలని వివేకా వంటి వారు ఎంతోమంది మీ పార్టీ వాళ్లే కోరుకున్నారు. వాళ్ల అండ చూసుకుని ఎప్పుడైనా ధిక్కరించానా? మీరు ముఖ్యమంత్రి అయ్యేంత వరకేమో నాకు రాజకీయ కాంక్ష, డబ్బు కాంక్ష లేనట్టా, ఏం చేసినా మీ కోసం చేసినట్టా... ఇప్పుడు నాకు రాజకీయ కాంక్ష, డబ్బు కాంక్ష ఉన్నట్టా?
మనిద్దరం నమ్మే బైబిల్ మీద ఒట్టేద్దాం... నాకు రాజకీయ కాంక్ష కానీ, డబ్బు కాంక్ష కానీ లేవని, మీ నుంచి నేను ఒక్క పదవి కూడా ఆశించకుండా మీకోసం చేశానని నేను చెప్పగలను. మీరు అదే బైబిల్ మీద ప్రమాణం చేసి... నేనేదైనా పదవి అడిగానని మీరు చెప్పగలరా? నాకు రాజకీయ కాంక్ష ఉందని కానీ, డబ్బు కాంక్ష ఉందని కానీ మీరు రుజువు చేయగలరా?
మనిషిని, మనిషి మంచితనాన్ని గుర్తించడం మీకు రాజశేఖర్ రెడ్డి గారి నుంచి ఎందుకు రాలేదు? రాజశేఖర్ రెడ్డి ఏనాడూ స్వలాభం కోసం ఆలోచించలేదు. ఆయన హృదయంలో హృదయంలా పెరిగిన దాన్ని నేను. నమ్మిన ఆశయాల కోసం ఏవిధంగా అయితే త్యాగం చేసే మనసు ఆయనకు ఉందో, అదే విధంగా నిస్వార్థంగా మీ కోసం నేను త్యాగం చేశాను" అంటూ కన్నీటిపర్యంతమయ్యారు. కాగా ఇటీవల ఓ ఛానల్‌లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజకీయ కాంక్షతో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి వైఎస్ కుటుంబంలో విభేదాలు తీసుకువచ్చారంటూ వ్యాఖ్యానించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com