Shanti Kumari IAS : తెలంగాణ సీఎస్‌గా శాంతికుమారి .. రాష్ట్ర తొలి మహిళా సీఎస్‌గా చరిత్ర, ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే

  • IndiaGlitz, [Wednesday,January 11 2023]

సోమేశ్ కుమార్‌ ఏపీకి వెళ్లడంతో తెలంగాణ కొత్త సీఎస్ ఎవరన్న దానిపై ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. దీనికి తెరదించుతూ.. కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శాంతికుమారి నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. అనంతరం మధ్యాహ్నం 3.15 గంలకు బీఆర్‌కే భవన్‌లో తెలంగాణ సీఎస్‌గా శాంతి కుమారి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాంతికుమారికి సీఎం అభినందనలు తెలియజేశారు. ఈ నియామకం ద్వారా తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా సీఎస్‌గా శాంతికుమారి రికార్డుల్లోకెక్కారు. ఆమె ఏప్రిల్ 2025 వరకు ఈ పదవిలో వుంటారు.

ఇది శాంతికుమారి ప్రస్థానం:

1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన శాంతికుమారి ప్రస్తుతం అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో వైద్య ఆరోగ్య శాఖ , సీఎంవోలోని స్పెషల్ ఛేజింగ్ సెల్‌లో పనిచేశారు. సీఎస్‌గా ఎంపికైన అనంతరం శాంతికుమారి మీడియాతో మాట్లాడారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు దేశానికే తలమానికంగా వున్నాయని.. వాటిని ఎంతో బాధ్యతతో అమలు చేస్తానని శాంతి కుమారి చెప్పారు.

రేపు ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయనున్న సోమేష్ కుమార్:

సీఎస్ సోమేష్ కుమార్‌ను తెలంగాణకు కేటాయించడాన్ని రాష్ట్ర హైకోర్టు మంగళవారం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఏపీ కేడర్‌కు వెళ్లాలని మంగళవారం ఏపీ హైకోర్ట్ డివిజన్ బెంచ్ తీర్పు వెలువరించింది. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో సోమేష్ కుమార్‌ను కేంద్రం ఏపీకి కేటాయించింది. దీనిని సవాల్ చేస్తూ ఆయన కేంద్ర పరిపాలనా ట్రిబ్యూనల్ (క్యాట్)ను ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన క్యాట్ కేంద్రం ఉత్తర్వులు నిలిపివేస్తూ సోమేష్ కుమార్‌ను తెలంగాణలో కొనసాగిస్తూ తీర్పు వెలువరించింది. ఆ వెంటనే ఆయనను తెలంగాణను రిలీవ్ చేస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ (డీవోపీటీ) ఉత్తర్వులు జారీ చేసింది. ఎల్లుండి లోగా ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని ఆదేశాల్లో తెలిపింది. దీంతో సోమేష్ కుమార్ రేపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయనున్నారు. తొలుత వీఆర్ఎస్ తీసుకుంటారని ప్రచారం జరిగినా ఆయన మనసు మార్చుకున్నట్లుగా తెలుస్తోంది.