శంకరాభరణం మూవీ రివ్యూ

  • IndiaGlitz, [Friday,December 04 2015]

ఈ మ‌ధ్య తెలుగు సినిమా అంతా ఎన్నారైల చుట్టూనే తిరుగుతుంది. త‌ను కూడా తిరిగితే త‌ప్పేంటి అనుకున్నాడేమో కానీ స్టార్ రైట‌ర్ ప‌ట్టంతో ఉన్న కోన‌వెంక‌ట్ ఇప్పుడు అలాంటి క‌థ‌ను రాసుకున్నాడు. అత్తారింటికి దారేది, పండ‌గ‌చేస్కో సినిమాల త‌ర‌హాలో ఈ సినిమా అంతా ఎన్నారైల చుట్టూనే న‌డిపాడు. స్వామిరారా నుండి సూర్య వ‌ర్స‌స్ సూర్య వ‌ర‌కు కొత్త క‌థ‌ల‌ను ఎంచుకుంటూ వచ్చిన నిఖిల్‌, కోన‌వెంక‌ట్‌పై న‌మ్మ‌కంతో ఈ సినిమా చేశాడ‌నే చెప్పాలి. అలాగే గ‌తంలో కోన‌వెంక‌ట్ స‌మ‌ర్ప‌ణ‌లో గ‌తంలో వచ్చిన గీతాంజ‌లి మంచి విజయాన్ని సాధించ‌డంతో శంక‌రాభ‌ర‌ణం కూడా అదే త‌ర‌హాలో కామెడితో ఉంటుంద‌ని ప్రేక్ష‌కుడు థియేట‌ర్‌కు వ‌స్తాడు. మ‌రి ప్రేక్ష‌కుడిని ఈ శంక‌రాభ‌ర‌ణం ఏ మేర మెప్పించిందో తెలుసుకోవాలంటే సినిమా క‌థ తెలుసుకోవాల్సిందే...

క‌థ‌

గౌత‌మ్‌(నిఖిల్) అమెరికాలో పుట్టి పెరిగిన ఇండియ‌న్‌. అత‌ని త‌ల్లిదండ్రులు(సుమ‌న్‌, సితార‌), చెల్లెలుతో క‌లిసి ఉంటాడు. తండ్రిని అత‌ని స్నేహిత‌లు బిజినెస్‌లో మోసం చేయ‌డంతో ఉన్న‌దంతా పోగొట్టుకోవ‌డమే కాకుండా రెండు మిలియ‌న్ డాల‌ర్స్ అప్పు మిగులుతుంది. ఆ బాధ‌లో అత్మ‌హ‌త్య చేసుకోవాల‌నుకుంటున్న తండ్రిని కాపాడిన గౌత‌మ్‌కు ఈ విష‌యం తెలియ‌డంతో అంద‌రూ బాధలో ఉండిపోతారు. అప్పుడు త‌ల్లి వార‌స‌త్వ ఆస్థి శంక‌రాభ‌ర‌ణం బంగ‌ళాను అమ్మేసి అప్పు తీర్చాలని గౌత‌మ్ ఇండియాకు వ‌స్తాడు. ఆ బంగ‌ళా బీహ‌ర్‌లో ఉంటుంది. అక్క‌డ‌కు చేరుకున్న గౌత‌మ్‌ను అత‌ని స్నేహితుడు(సప్త‌గిరి) రిసీవ్ చేసుకుంటాడు. బీహ‌ర్‌లో విలువైన వ‌స్తువేదైనా కిడ్నాప్ చేసేస్తార‌ని చెబుతాడు. గ్రామం చేరుకున్న త‌ర్వాత అక్క‌డ గౌత‌మ్ బిలియ‌నీర్ అని కూడా చెబుతాడు. దాంతో అక్క‌డ ఉన్న కిడ్నాప్ గ్యాంగ్ లీడ‌ర్స్ భాయ్ జాన్‌(సంజ‌య్ మిశ్రా). మున్నీ(అంజ‌లి), సలీం, హోం మినిష్ట‌ర్ పాండే(సంప‌త్‌)లు గౌత‌మ్‌ను కిడ్నాప్ చేయాల‌నుకుంటారు. ఇంటికి చేరుకున్న త‌న బంగ‌ళాలో త‌న దూర‌పు బంధువులంతా ఉండ‌టం చూసి బంగ‌ళాను ఎవ‌ర‌కీ తెలియ‌కుండా అమ్మేసి వారినంతా అక్క‌డి నుండి పంపేయాల‌నుకుంటాడు. అయితే గౌత‌మ్ మ‌ర‌ద‌లు హ్య‌పీ(నందిత‌)కి గౌత‌మ్ ప్లాన్ తెలిసిపోతుంది. అప్పుడు హ్య‌పీ ఏం చేస్తుంది? అస‌లు కిడ్నాప్ గ్యాంగ్‌లు గౌత‌మ్‌ను కిడ్నాప్ చేశాయా? గౌత‌మ్ ఆ బంగ‌ళాను అమ్మేస్తాడా? అప్పుల‌న్నీ తీర్చేస్తాడా? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...

ప్ల‌స్ పాయింట్స్‌

ఈ సినిమాలో ప్ర‌ధానమైన హైలైట్ థ‌ర్టీ ఇయ‌ర్స్ పృథ్వీ కామెడి ట్రాక్‌. ప‌ర్సంటేజ్ ప‌ర‌మేశ్వ‌ర్‌గా ప‌వ‌న్‌క‌ళ్యాన్ గ‌బ్బ‌ర్‌సింగ్ గెట‌ప్‌లో ఉంటూ త‌న‌దైన స్ట‌యిల్‌లో కామెడిని ఇర‌గ‌దీశాడు. కమెడియ‌న్ సునీల్ హీరోగా మారిపోవ‌డం, బ్ర‌హ్మానందంను డైరెక్ట‌ర్స్‌, రైట‌ర్స్ ప‌క్క‌న పెట్ట‌డం వంటి ప‌లు కార‌ణాల‌తో ఇప్పుడు పృథ్వీ హైలైట్ అవుతున్నాడు. ముఖ్యంగా త‌న పాత్ర‌ను పంచ్‌ల‌తో, ఎక్స్‌ప్రెష‌న్స్‌తో అద‌ర‌గొట్టాడు. స‌ప్త‌గిరి కామెడి కొంత మేర బావుంది. మిగిలిన కామెడి ట్రాక్ ఆక‌ట్టుకోదు. సాయికార్తీక్ సినిమాటోగ్ర‌పీ బావుంది. నిఖిల్ త‌న పాత్ర‌కు న్యాయం చేశాడు. ఇందులో త‌ను కొత్త‌గా చేసిందేమీ లేదు. అలాగే నందిత కూడా హ్య‌పీ పాత్రలో ఒదిగిపోయింది. రావుర‌మేష్, చెల్లెలుపై కోపం ఉన్న అన్న‌య్య పాత్ర సునాయ‌సంగా చేశాడు. హీరో చేతిలో బ‌క‌రా అయ్యే పొలిటీషియ‌న్‌గా సంప‌త్ యాజ్ యూజువ‌ల్‌గా చేశాడు.

మైన‌స్ పాయింట్స్‌

ఉద‌య్ నంద‌న‌వ‌న‌మ్ సినిమా క‌థ‌ను గ్రిప్పింగ్‌గా న‌డిపించ‌లేక‌పోయాడు. క్యాస్టింగ్ వాల్యూను పెంచ‌డం కోసం అంజ‌లితో మున్నీ అనే బండిట్ క్వీన్ పాత్ర వేయించారే త‌ప్ప, అంజ‌లికి ఈ సినిమా వ‌ల్ల ఉప‌యోగం లేద‌నిపించింది. ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు సంగీతం అంత మాత్రంగానే ఉంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ఎఫెక్టివ్‌గా అనిపించ‌లేదు. పెద్ద ఫ్యామిలీ వారి అనురాగాలు, హీరో వాళ్ళ‌ని మోసం చేయాల‌నుకోవ‌డం, చివ‌ర‌కు చేయ‌లేక‌పోవ‌డం రొటీన్ పాయింట్‌ను బీహార్ కిడ్నాప్ బ్యాక్ డ్రాప్‌తో లింక్ పెట్టి సినిమాను తెర‌కెక్కించ‌డం దాని నుండి కామెడిని క్రియేట్ చేయాల‌నుకోవ‌డం వ‌ర్క‌వుట్ కాలేదు. ఆడియెన్ ఫ‌స్టాఫ్ అంతా గంద‌ర‌గోళంగా అనిపిస్తుంది. ఇక సెకండాఫ్ విష‌యానికి వ‌స్తే థ‌ర్టీ ఇయ‌ర్స్ పృథ్వీ లేకుంటే సెకండాఫ్ లేద‌నే చెప్పాలి. మిగ‌తా యూనిట్ అంతా ఒక‌వైపు అయితే పృథ్వీ సినిమానంతా త‌న భుజాల‌పై మోశాడు. ఫ‌స్టాఫ్‌తో పోల్చితే సెకండాఫ్ కాస్తా బెట‌ర్‌గా అనిపిస్తుంది. ఎడిటింగ్‌లో కొన్ని సీన్స్‌ను తొలిగిస్తే బావుండేది. వ

విశ్లేష‌ణ‌

ఎప్పుడో బీహ‌ర్ వెళ్ళిన‌ప్పుడు త‌న స్నేహితుడు చెప్పిన కొన్ని ఘ‌ట‌న‌ల‌ను బీజం చేసుకుని బాలీవుడ్ మూవీ ఫ‌స్ గ‌యా ఒబామా ఆధారంగా శంక‌రాభ‌ర‌ణం సినిమా క‌థ‌ను రాసుకున్నాడు. క‌థను రాసుకుంటే రాసుకున్నాడు. తానేం రామ్‌గోపాల్ వ‌ర్మ‌కు త‌క్కువ తిన‌లేద‌న్న‌ట్లు క్లాసిక్ మూవీ టైటిల్స్‌ను ఏదైనా చేయాల‌నుకున్నాడేమో కానీ త‌న సినిమాకు శంకరాభ‌ర‌ణం అనే పేరు పెట్టుకున్నాడు. టైటిల్ పెట్టుకుంటే పెట్టాడు కానీ సినిమాను ఓ రేంజ్‌లో తీసి ప్రేక్ష‌కుడి స‌హానానికి ప‌రీక్ష పెట్టాడు.కోన‌వెంక‌ట్ రీసెంట్‌గా ఓ ఇంట‌ర్వ్యూలో త‌ను అఖిల్‌, బ్రూస్‌లీ చిత్రాల‌తో స్టార్ హీరోల న‌మ్మ‌కాన్ని పొగొట్టుకున్నాన‌ని, శంక‌రాభ‌ర‌ణంతో ఆ నమ్మ‌కాన్ని సాధిస్తాన‌ని అన్నాడు. ఈ సినిమా చూస్తే చిన్న హీరోలు కూడా ఇప్పుడు కోన‌లాంటి స్టా....ర్‌...రైట‌ర్‌..తో ప‌నిచేయాలంటే ఆలోచిస్తారు. మంచి సినిమా తీస్తే ప్రేక్ష‌కులే కాదు, విమ‌ర్శ‌కులు కూడా నోరు మెద‌ప‌లేరు. మ‌న ద‌గ్గ‌ర విష‌యం లేన‌ప్పుడు ప‌క్క‌వాడిని సాకుగా చూపి ర‌భ‌స చేయ‌కూడదు. కోన వెంక‌ట్ ఆ విష‌యాన్ని మ‌ర‌చిపోయి రివ్యూలు రాసేవాళ్ళ‌పై ఓ రాయి వేయడానికి ప్ర‌య‌త్నించాడే కానీ సినిమా స్టోరీ ప‌ట్టు లేక‌పోవ‌డం గ‌మ‌నించుకోలేదు. వంద సినిమాలు చేసిన పెద్ద డైరెక్ట‌ర్స్ కూడా ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ అని వేసుకోవాలంటే ఆలోచిస్తారు. ఎప్పుడో పాతికేళ్ళ క్రితం ఒక సినిమాను ద‌ర్శ‌క‌త్వం చేసేసి ఇప్పుడు ద‌ర్శ‌క‌త్వ పర్య‌వేక్ష‌ణ అని వేసుకోవ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బో తెలియ‌డం లేదు. అలా వేసుకోవ‌డానికి పారామిట‌ర్స్ అవ‌స‌ర‌మా లేద‌నుకున్నాడేమో మ‌రి. క‌థ‌ను రాసుకోవ‌డం కాదు, సినిమాను గ్రిప్పింగ్‌గా తెర‌కెక్కించ‌డం కూడా.

బాట‌మ్ లైన్‌

ప్రేక్ష‌కుడిని స‌హానాన్ని ప‌రీక్షించే శంక‌రాభ‌ర‌ణం'.. టైటిల్ మాత్రమేనండోయ్ క్లాసిక్‌...

రేటింగ్‌: 2/5