చైనాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు... లాక్డౌన్ పరిధిలోకి కీలక నగరం
- IndiaGlitz, [Monday,March 28 2022]
భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ మహమ్మారి అదుపులోనే వుంది. కానీ కరోనా పుట్టినిల్లు చైనాలో మాత్రం వైరస్ విజృంభిస్తోంది. ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ కరోనా దూకుడు తగ్గడం లేదు. దీంతో చాలా నగరాలు లాక్డౌన్ పరిధిలోకి వెళ్లిపోతున్నాయి. తాజాగా చైనాలో అతిపెద్ద నగరాల్లో ఒకటైన షాంఘైలో లాక్డౌన్ విధించారు అధికారులు. 2.6 కోట్ల జనాభా కలిగిన ఈ నగరంలో పౌరులందరికీ కొవిడ్ పరీక్షలను చేపడుతున్నారు. అయితే, కోవిడ్ వెలుగు చూసిన నాటి నుంచి నేటి వరకు చైనాలో ఇంతపెద్ద నగరంలో ఆంక్షలు అమలు చేయడం ఇదే తొలిసారి.
ఆదివారం ఒక్కరోజే నగరంలో 3450 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో 70శాతం ఇక్కడే వెలుగుచూడటంతో అధికార యంత్రాంగం ఉలిక్కిపడింది. వీటిలో అత్యధికం లక్షణాలు లేనివే ఉన్నాయని.. కేవలం 50 మందిలోనే కొవిడ్ లక్షణాలు కనిపించాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే భారీ స్థాయిలో పరీక్షలు నిర్ణయించేందుకు సంకల్పించారు. ఈ నేపథ్యంలోనే షాంఘై నగరంలో సోమవారం నుంచి లాక్డౌన్ అమలు చేస్తున్నారు. అయితే, రెండున్నర కోట్లకు పైగా జనాభా వున్న ఈ నగరంలో ఒకేసారి కాకుండా రెండు దఫాల్లో లాక్డౌన్ ఆంక్షలను అమలు చేస్తున్నట్లు సమాచారం.
లాక్డౌన్ దృష్ట్యా వాణిజ్య కార్యాలయాలు, పరిశ్రమలు, ప్రజా రవాణా మూసివేయాలని అధికారులు ఆదేశించారు. నగరం నుంచి రాకపోకలపైనా ఆంక్షలు ఉంటాయన్నారు. ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావద్దని.. నిత్యావసర సరుకులు ఇంటి దగ్గరలోనే విడిచి పెడతామని అధికారులు సూచించారు. అయితే లాక్డౌన్ ఆంక్షలు మొదలవ్వడానికి ముందే షాంఘై ప్రజలు అప్రమత్తమయ్యారు. ముందుజాగ్రత్తగా నిత్యావసర వస్తువులను పెద్ద సంఖ్యలో కొనుగోలు చేశారు. దీంతో నగరంలోని సూపర్ మార్కెట్లన్నీ ఆదివారం కిటకిటలాడటంతో పాటు సరకులన్నీ నిండుకున్నాయి.