షేన్‌వార్న్ మరణంపై కొత్త అనుమానాలు.. హోటల్ గదిలో, టవల్స్‌పై రక్తపు మరకలు

ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ మరణంతో క్రికెట్ ప్రేమికులు షాక్‌కు గురయ్యారు. ఆయన లేరనే వార్తతో క్రికెట్ ప్రపంచం మూగబోయింది. తన స్పిన్ మాయాజాలంతో జట్టుకు ఎన్నో చిరస్మరణీయమైన విజయాలు అందించి.. లెజెండ్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు షేన్ వార్న్. అయితే ఎంతో ఆరోగ్యంగా వుండే వార్న్ గుండెపోటుతో మరణించారని చెబుతుండటం.. గదిలో ఆయన అచేతనంగా పడివున్నారని వార్తలు వస్తుండటం పలు అనుమానాలను కలిగిస్తోంది.

ఈ నేపథ్యంలో వార్న్‌ ఆకస్మిక మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన థాయ్‌ పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. వార్న్‌ మరణించిన గదిలో ఫ్లోర్‌, టవల్స్‌పై రక్తపు మరకలు గుర్తించామని .. వార్న్‌ మరణించడానికి ముందు భయాందోళనలకు గురై, నరకయాతన అనుభవించి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

వార్న్‌ గదిలో విగతజీవిగా పడి ఉండటాన్ని గుర్తించి, ఆసుపత్రికి తరలించడానికి ముందు సీపీఆర్‌ చేశామని అతని స్నేహితులు చెబుతున్నారు. గుండెపై ఒత్తిడి తెచ్చే క్రమంలో అతను రక్తపు వాంతులు చేసుకున్నాడని వారు అంటున్నారు. మరోవైపు ఆదివారం థాయ్‌‌లాండ్‌లో వార్న్‌ భౌతికకాయానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఈ నివేదిక ఆధారంగానే స్పిన్ మాంత్రికుడి మరణంపై ఓ క్లారిటీ రానుంది. పోస్టుమార్టం అనంతరం వార్న్‌ భౌతికకాయాన్ని స్వస్థలమైన ఆస్ట్రేలియాకు తరలించినట్లుగా తెలుస్తోంది. అధికారిక లాంచనాలతో వార్న్‌ అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆసీస్ సర్కార్ ఏర్పాట్లు పూర్తి చేసింది.