కరోనా సూపర్ స్ప్రెడర్‌గా కరణ్ జోహర్ పార్టీ  ... మరో ‘‘కపూర్‌’’కు పాజిటివ్

  • IndiaGlitz, [Thursday,December 16 2021]

హిందీ చిత్ర పరిశ్రమలో కరోనా కలకలం రేపుతోంది. సీనియర్ హీరోయిన్లు కరీనా కపూర్, అమృతా అరోరాలకు ఇప్పటికే పాజిటివ్‌గా తేలిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వారిద్దరూ సూపర్ స్ప్రెడర్‌లుగా మారారని ముంబై నగర పాలక సంస్థ అధికారులు చెబుతున్నారు. చెప్పిన విధంగానే స్టార్ షనయా కపూర్‌కు పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. నాలుగు రోజుల క్రితం టెస్ట్ చేయించుకోగా నెగెటివ్ వచ్చిందని, మళ్లీ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా తేలిందని ఆమె సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి బావుందని, స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపించాయని షనయా చెప్పారు. అలాగే తనను కలిసిన వారందరూ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా ఆమె కోరారు.

కాగా.. 'కభీ ఖుషి కభీ గమ్' సినిమా విడుదలై రెండు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా దర్శక - నిర్మాత కరణ్ జోహార్ ఇంట్లో పెద్ద పార్టీ ఇచ్చారు. ఈ విందుకు హాజరైన తర్వాత కరీనాకు కరోనాగా తేలింది. అదే పార్టీకి షనయా తల్లి మహీప్ కపూర్ కూడా హాజరవ్వగా.. ఆమెకు కూడా వైరస్ సోకింది. ఆమె నుంచి షనయాకు కరోనా సోకి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు కరణ్ జోహార్ ఇంట్లో పార్టీకి హాజరైన కరీనా కపూర్, అమృతా అరోరా, సీమా ఖాన్, మహీప్ కపూర్, షనయాలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో క‌ర‌ణ్ జోహార్‌పై నెటిజన్లు, అధికారులు విరుచుకుపడుతున్నారు. దీనికి ఆయన కూడా ధీటుగా జవాబిచ్చారు. తమ ఇంట్లో ఎనిమిది మంది మాత్రమే కలిశామని, దాన్ని పార్టీ అనరని.. అదే సమయంలో కొవిడ్ ప్రొటొకాల్స్ పాటించామని కరణ్ జోహార్ క్లారిటీ ఇచ్చారు. తమ కుటుంబ సభ్యులు చేయించుకున్న ఆర్‌టీపీసీఆర్‌ టెస్టుల్లో నెగెటివ్ రిజల్ట్స్ వచ్చినట్టు కరణ్ జోహార్ పేర్కొన్నారు.

మరోవైపు కరోనాకు పాజిటివ్ అని తేలగానే అప్రమత్తమైన బీఎంసీ అధికారులు వెంటనే ఆమె ఇంటిని సీల్‌ చేశారు. అక్కడి వారందరికీ పరీక్షలు చేశారు. అయితే కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ విషయంలో కరీనా కుటుంబం తమకు సహకరించడం లేదని అధికారులు మండిపడుతున్నారు. సైఫ్‌ అలీ ఖాన్‌ ముంబయిలో లేరన్న విషయాన్ని చెప్పారని, అయితే ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నారన్నది మాత్రం చెప్పట్లేదంటూ అధికారులు ఆరోపిస్తున్నారు. అయితే బీఎంసీ బృందాలు మాత్రం పట్టువిడకుండా ప్రయత్నిస్తూనే వున్నాయి.