శంభో శంకర టీజర్ ను లాంచ్ చేసిన డైరెక్టర్ హరీష్ శంకర్

  • IndiaGlitz, [Friday,June 08 2018]

శంక‌ర్ ని హీరోగా, శ్రీధ‌ర్ ఎన్. ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ ఆర్. ఆర్. పిక్చ‌ర్స్ సంస్థ, ఎస్.కె. పిక్చ‌ర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో వై. ర‌మ‌ణారెడ్డి, సురేష్ కొండేటి సంయుక్తంగా నిర్మిస్తోన్న 'శంభో శంక‌ర'. ఈ సినిమా టీజ‌ర్‌ని శుక్ర‌వారం హైద‌రాబాద్ రామానాయుడు స్టూడియోలో విడుద‌ల చేశారు. డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్ ముఖ్య అతిథిగా హాజ‌రై టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు.

నిర్మాత వై.ర‌మ‌ణారెడ్డి మాట్లాడుతూ - ''సినిమాల‌పై ఉన్న ప్యాష‌న్‌తోనే ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చాను. శంక‌ర్‌, సురేశ్‌కొండేటి స‌హకారంతో శంభో శంక‌ర సినిమాను నిర్మించాను. క‌చ్చితంగా ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందుతుంది'' అన్నారు.

సురేశ్ కొండేటి మాట్లాడుతూ - '' మంచి స‌బ్జెక్ట్‌తో శంక‌ర్ , డైరెక్ట‌ర్ శ్రీధ‌ర్ నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చారు. క‌థ విన‌గానే న‌చ్చ‌డంతో ఈ సినిమా నిర్మాణంలో నేను కూడా పార్ట్ అయ్యాను. శంక‌ర్ అద్భుతంగా న‌టించాడు. ఈ సినిమానే కాకుండా త‌ను మ‌రో ప‌ది సినిమాలు చేస్తాడ‌నే నమ్మ‌కం నాకుంది. నేనే త‌న‌తో రెండు, మూడు సినిమాలు చేసే అవ‌కాశం ఉంది. మంచి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా చేయాల‌నే ఉద్దేశంతో ఈ సినిమాను నిర్మించాను'' అన్నారు.

ద‌ర్శ‌కుడు శ్రీధ‌ర్ మాట్లాడుతూ - ''హ‌రీశ్‌శంక‌ర్‌గారికి థాంక్స్‌. సినిమా బాగా వ‌చ్చింద‌ని చెప్ప‌డం కంటే సినిమా ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే సినిమా అవుతుంద‌ని న‌మ్మ‌కం ఉంది. శంక‌ర్ దృష్టిలో పెట్టుకునే ఈ సినిమా చేశాను. ఇక‌పై కూడా త‌న‌తోనే సినిమాలు చేస్తాను. నా నెక్ట్స్ సినిమా కూడా త‌న‌తోనే ఉంటుంది. పాట‌లు బాగా కుదిరాయి. ప‌సిడి ప‌ల్లె ఇటీవ‌ల విడుద‌లై మంచి స్పంద‌న‌ను రాబ‌ట్టుకుంది. సాయికార్తీక్ అద్భుత‌మైన సంగీతాన్ని అందించారు. సినిమాటోగ్రాఫ‌ర్ రాజ‌శేఖ‌ర్‌గారు అద్భుత‌మైన విజువ‌ల్స్ ఇచ్చారు. మంచి టీం స‌హ‌కారంతో మంచి సినిమాను చేయ‌గ‌లిగాను'' అన్నారు.

హీరోయిన్ కారుణ్య మాట్లాడుతూ - ''ఇది నా రెండో సినిమా. తెలుగు అమ్మాయిని. అంద‌రూ ఎఫ‌ర్ట్ పెట్టి చేశాం. మంచి రెస్పాన్స్ వ‌స్తుంద‌ని ఆశిస్తున్నాం'' అన్నారు.

హీరో శంక‌ర్ మాట్లాడుతూ - ''నేను ప‌వ‌న్‌క‌ల్యాణ్‌గారిని మ‌న‌సులో పెట్టుకునే ప‌ని చేశాను. అందుకే ఈ స్థాయికి ఎదిగాను. నేను ఎక్స‌ర్‌సైజులు చేసి బ‌రువు త‌గ్గాన‌ని అనుకున్నారు . కానీ రెండేళ్లు సినిమాలు లేక‌.. తిండి లేక త‌గ్గిపోయాను. అలాంటి టైమ్‌లోనే ఈ సినిమా చేసే అవ‌కాశం వ‌చ్చింది. నా వంతు ప్ర‌య‌త్నం చేశాను. ఫ‌లితాన్ని ప్రేక్ష‌కులే నిర్ణ‌యిస్తారు. మంచి నిర్మాత‌లు స‌హ‌కారంతో శ్రీధ‌ర్ సినిమాను తెర‌కెక్కించారు. అంద‌రికీ థాంక్స్‌'' అన్నారు.

హ‌రీశ్ శంక‌ర్ మాట్లాడుతూ - ''శంక‌ర్ నాకు ప‌దేళ్లుగా తెలుసు. ఆఫీస్ బాయ్ స్థాయి నుండి ఈ స్థాయికి ఎదిగాడు శంక‌ర్‌. ప‌వ‌న్‌గారితో గ‌బ్బ‌ర్‌సింగ్ స‌క్సెస్‌లో శంక‌ర్ పాత్ర కూడా ఉంది. ఎందుకంటే త‌ను అద్భుతంగా స్కెచ్‌ల‌ను వేసి ఇచ్చాడు. ప‌వ‌న్‌గారు కూడా శంక‌ర్‌ను ఆ విష‌యంలో అభినందించారు. త‌ర్వాత కాలంలో ప‌వ‌న్‌గారితో కూడా శంక‌ర్ న‌టించాడు. 35 రోజుల్లో సినిమాను పూర్తి చేయ‌డం అంత సుల‌భం కాదు. ఈ విష‌యంలో ద‌ర్శ‌క నిర్మాత‌ల‌ను, యూనిట్‌ను అభినందిస్తున్నాను. శంక‌ర్‌...క‌ష్ట‌ప‌డితే ఎక్క‌డైనా ఫ‌లితం ఉంటుంది . ప‌వ‌న్ క‌ల్యాణ్ గారి సినిమా మొత్తం పూర్త‌య్యాకే చూడాల‌నుకుంటాను. అలాగే శంక‌ర్ న‌టించిన ఈసినిమాను అలాగే చూడాల‌నుకుంటున్నాను. యూనిట్‌కి ఆల్ ది బెస్ట్‌'' అన్నారు.

ఇందులో శంక‌ర్ స‌ర‌స‌న కారుణ్య నాయిక‌గా న‌టించింది. నాగినీడు, అజ‌య్ ఘోష్, ర‌వి శంక‌ర్, ప్ర‌భు, ఏడిద శ్రీరామ్ త‌దిత‌రులు న‌టించారు. ఈ చిత్రానికి మాట‌లు: భ‌వానీ ప్ర‌సాద్, కెమెరా: రాజ‌శేఖ‌ర్, సంగీతం: సాయి కార్తిక్, ఎడిటింగ్: ఛోటా.కె. ప్ర‌సాద్, నిర్మాతలు : వై. ర‌మ‌ణారెడ్డి, సురేష్ కొండేటి, క‌థ‌, స్ర్కీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: శ్రీధ‌ర్. ఎన్.