కమెడియన్స్ హీరోలుగా మారి ప్రేక్షకులను మెప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ బాటలో అడుగు పెట్టిన మరో కమెడియన్ షకలక శంకర్. జబర్‌దస్త్ షో నుండి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి అటు నుండి ఇప్పుడు ఏకంగా నిర్మాతగా మారాడు షకలక శంకర్. `కమెడియన్‌గా నా స్థాయికి తగ్గ సినిమాలు రావడం లేదు అందుకే హీరోగా మారాను` అని అన్న శంకర్‌కి `శంభో శంకర` చిత్రం హీరోగా స్థాయి పెంచిందా? లేదా? అనే విషయం తెలుసుకోవాలంటే సినిమా కథంటే చూద్దాం.
కథ:
శంకర్(షకలక శంకర్) ఊర్లో జరుగుతున్న అన్యాయాలు చూడలేక పోలీస్ కావాలనుకునే యువకుడు. అతనుండే గాజులమ్మ పల్లె ప్రెసిడెంట్(అజయ్ ఘోష్), ఇన్‌స్పెక్టర్(ప్రభు)తో కలిసి ప్రజలకు అన్యాయం చేస్తుంటాడు. వీరి అన్యాయాలకు శంకర్ ఎదురు తిరుగుతుంటాడు. అందువల్ల వీరిద్దరూ శంకర్‌పై కక్ష కడతారు. శంకర్‌కి పోలీస్ సెలక్షన్స్‌లో ఎన్నిక కాకుండా చూస్తారు. ఊర్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ నచ్చిన అమ్మాయి(కారుణ్య)తో ప్రేమలో ఉండే శంకర్‌కి చెల్లెలంటే ప్రాణం. ఆ అమ్మాయి ప్రెసిడెంట్ అబ్బాయిని ప్రేమిస్తుంది. అతను శంకర్ చెల్లెల్ని చంపేస్తాడు. దాంతో శంకర్, ప్రెసిడెంట్ కొడుకుని చంపేస్తాడు. శంకర్ నిజాయతీ తెలిసి జిల్లా ఎస్.పి(నాగినీడు) తనని సొంత పూచీకత్తుపై విడుదల చేస్తాడు. శంకర్ ప్రెసిడెంట్ అన్యాయాలకు చరమ గీతం పాడుతానని చాలెంజ్ చేస్తాడు. తర్వాత కథేంటో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...
సమీక్ష:
నడుస్తున్న బాట సుఖంగా ఉంది. సరే రిస్క్ చేద్దామని అనుకున్నప్పుడు వెళ్లాల్సిన బాటలో జాగ్రత్తగా నడవడానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే దెబ్బపడుతుంది. ఇప్పుడు శంకర్ విషయంలో జరిగింది అదే. కమెడియన్‌గా ఉన్న వ్యక్తి వివాదస్పద వ్యాఖ్యలు చేసి హీరోగా సినిమా చేశాడు. కానీ కథ, కథనంలో దమ్ముందా? చూసే ప్రేక్షకుడు సింపుల్‌గా పెదవి విరుస్తాడు. అసలు హీరో క్యారెక్టర్ ఓ పర్టికులర్ గోల్ ఏదీ లేకుండా సాగిపోతుంటుంది. అతను తప్ప మరో మగాడే లేడన్నట్లు హీరోయిన్ అతని వెనుక పడుతుంటుంది. బలమైన విలనిజం లేదు. ప్రెసిడెంట్ కొడుకుని హీరో చంపేస్తే.. ప్రెసిడెంట్ ఎమోషన్స్ పళ్లు కొరకడం తప్ప మరేం కనపడదు. మధ్యలో ఊడిపడే చెల్లెలు సెంటిమెంట్.. ఆమె కోసం హత్య చేసే హీరో.. హత్య చేసిన హీరోని ఏమీ చేయలేని పోలీస్ వ్యవస్థ.. ఇవన్నీ సినిమాలో కనపడతాయి. పోనీ సంపూర్ణేష్ లెవల్లో ఇదేమైనా కామెడీ యాంగిల్లో ఉంటుందా? అంటే లేదు.. మళ్లీ సీరియస్‌గా కథ నడుస్తుంటుంది. దర్శకుడు శ్రీధర్ కథ, కథనంలో కేర్ తీసుకోలేదు. సన్నివేశాల్లో ఎమోషన్స్ లేవు. అతుకులు బొతుకులుగా, సంబంధం లేని సన్నివేశాలు ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతాయి. సాయికార్తీక్ సంగీతం, నేపథ్య సంగీతం, రాజశేఖర్ సినిమాటోగ్రఫీ పేలవంగా ఉన్నాయి. ఎడిటింగ్ గురించి మాట్లాడకపోవడమే మంచింది. నటీనటులు, సాంకేతికంగా అందరూ కలిసి చేసిన ప్రయత్నం బూడిదలో పోసినట్లు అయ్యింది.
Comments