Download App

Shailaja Reddy Alludu Review

ప్ర‌తి మ‌నిషిలో అంత‌ర్గ‌తంగా కొన్ని ల‌క్ష‌ణాలుంటాయి. అవి మ‌న చ‌ర్య‌లు ద్వారానే బ‌య‌ట‌ప‌డుతుంటాయి. అటువంటి వాటిలో అహం(ఇగో) స‌మ‌స్య ఒక‌టి. ఏదైనా మోతాడు మించితే భ‌రించ‌డం క‌ష్ట‌మే. అలాగే ఇగో కూడా మోతాదు మించితే మ‌నం చాలా స‌మ‌స్య‌ల‌ను మ‌న‌కు తెలియ‌కుండా క్రియేట్ చేసుకున్న‌ట్లే. మ‌న చుట్టూ వ్య‌క్తులు మ‌న ప్ర‌వ‌ర్త‌న‌తో ఇబ్బంది ప‌డుతుంటారు. ఒక వ్య‌క్తికే ఇలాంటి ఇగో స‌మ‌స్య ఉంటే ఓకే.. కానీ ప‌దిమందికి ఇగో స‌మ‌స్య ఉండి వారి మ‌ధ్య‌లోకి ఒక సాధార‌ణ వ్య‌క్తి వ‌స్తే.. ఎలా ఇబ్బందుల‌ను ఫేస్ చేస్తాడ‌నే క‌థాంశంతో రూపొందిన చిత్ర‌మే `శైల‌జారెడ్డి అల్లుడు`. ఇందులో శైల‌జారెడ్డి పాత్ర‌లో ర‌మ్య‌కృష్ణ న‌టిస్తే.. ఆమె అల్లుడు పాత్ర‌లో నాగ‌చైత‌న్య న‌టించాడు. కుటుంబ క‌థా చిత్రాల ప్రేక్ష‌కుల‌కు, అక్కినేని అభిమానుల‌కు ద‌గ్గ‌ర‌య్యే ప్ర‌య‌త్నంలో భాగంగా ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను ప్ర‌ధానంగా చేసుకుని సినిమాల‌నుతెరెక్కించే ద‌ర్శ‌కుడు మారుతితో చైత‌న్య ఈ సినిమా చేయ‌డం విశేషం. కుర్ర హీరోలు నానికి `భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌`.. శ‌ర్వాకి `మ‌హానుభావుడు` వంటి హిట్స్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు మారుతి చైత‌న్య‌కు `శైల‌జారెడ్డి అల్లుడు` చిత్రంతో ఎలాంటి హిట్ ఇచ్చాడో తెలుసుకోవాలంటే సినిమా క‌థ‌లోకి వెళ‌దాం...

క‌థ‌:

పాజిటివ్‌గా ఆలోచించి స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారాలు వెతికే ధ‌న‌వంతుడు చైత‌న్య‌(నాగ‌చైత‌న్య‌) . ఇత‌ని తండ్రి రావ్‌(ముర‌ళీశర్మ‌)కు ఇగో ఎక్కువ‌. ప్ర‌తి చిన్న విష‌యానికి ఇగో చూపిస్తూ త‌నతో ఉన్న‌వారంద‌రినీ బాధ‌పెడుతూ ఉంటాడు. ఓసారి చైత‌న్య అను(అను ఇమ్మాన్యుయ‌ల్‌)ని చూసి ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఆమె కూడా ధ‌న‌వంతుల బిడ్డ‌. అయితే ఆమెకు చైతు తండ్రి లాగే ఇగో ఎక్కువ‌గా ఉంటుంది. అయితే చైత‌న్య అదేం ఆలోచించ‌కుండా ఆమెను ప్రేమ‌లో ప‌డేస్తాడు. వీరి విష‌యం తెలిసిన రావ్‌కి అను ఇగో బిహేవియ‌ర్ న‌చ్చ‌డంతో పెళ్లి అడ్డుచెప్ప‌డు. అదే సమ‌యంలో ఓ ప్రైవేట్ కార్య‌క్ర‌మంలో వ‌చ్చిన అతిథితో మాటా మాట పెరిగి ఇగో కోసం అక్క‌డే చైత‌న్య‌, అనుల‌కు నిశ్ఛితార్థం జ‌రిపిస్తాడు రావ్‌. కానీ త‌ర్వాత అను వ‌రంగ‌ల్‌లో ప‌వ‌ర్‌ఫుల్ వ్య‌క్తి శైల‌జారెడ్డి (ర‌మ్య‌కృష్ణ‌) కూతుర‌ని తెలుస్తుంది. శైల‌జారెడ్డి స్త్రీ ప‌క్ష‌పాతి. ఇగో ఎక్కువ‌. ఆమె గురించి వివ‌రాలు తెలుసుకున్న ఇక త‌న ప్రేమ‌ను గెలిపించుకోవ‌డానికి వ‌రంగ‌ల్ చేరుకుంటాడు. చివ‌ర‌కు శైల‌జారెడ్డిని చైత‌న్య ఒప్పించాడా?  లేదా?  చైతు, అను ఒక్క‌ట‌య్యారా?  అంద‌రి ఇగో స‌మ‌స్య‌ల‌ను చైతు ఎలా తీర్చాడు? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...

ప్ల‌స్ పాయింట్స్‌:

- చైత‌న్య‌, ర‌మ్య‌కృష్ణ న‌ట‌న‌
- సినిమాటోగ్ర‌ఫీ
- నిర్మాణ విలువ‌లు
- పృథ్వీ, వెన్నెల‌కిశోర్ కామెడీ

మైన‌స్ పాయింట్స్‌:

- నేప‌థ్య‌సంగీతం
- సెకండాఫ్ సాగ‌దీత‌గా ఉండ‌టం
- అనుఇమ్మాన్యుయేల్‌
- పాత క‌థ‌, రొటీన్ టేకింగ్‌

విశ్లేష‌ణ‌:

న‌టీన‌టులు:

నాగ‌చైత‌న్య లుక్ ప‌రంగా బావున్నాడు. న‌ట‌న కూడా ఇది వ‌ర‌కు త‌న చిత్రాల‌కు భిన్న‌మైన బాడీ లాంగ్వేజ్‌తో న‌టించాడు. ఇక అను ఇమ్మాన్యుయల్ గ్లామ‌ర్‌గా క‌న‌ప‌డింది. ఇగో ఉన్న అమ్మాయి పాత్ర‌లో న‌టించినా.. టెక్కు పెద్ద‌గా క‌న‌ప‌డ‌లేదు. అలాగే ఎమోష‌న‌ల్ సీన్స్‌లో అను న‌ట‌న పెద్ద‌గా న‌టించ‌లేదు. ఇక సినిమాలో ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ర‌మ్య‌కృష్ణ శైలజారెడ్డిగా ఒదిగిపోయారు. శివ‌గామి పాత్ర‌లో మెప్పించిన ర‌మ్య‌కృష్ణ‌కు ఈ పాత్ర చేయ‌డం ఎమంత క‌ష్టం కూడా కాదు. ఇక చైత‌న్య నాన్న‌గా న‌టించిన ముర‌ళీశ‌ర్మ కూడా త‌న పాత్ర‌కు వంద‌శాతం న్యాయం చేశారు. ఇగోయిస్టిక్ తండ్రి పాత్ర‌లోత‌న‌దైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నారు. ఇక హీరోయిన్ త‌ల్లిగా న‌టించిన శ‌ర‌ణ్య‌, హీరో అసిస్టెంట్‌గా న‌వ్వులు పూయించే పాత్ర‌లో వెన్నెల‌కిషోర్‌.. ర‌మ్య‌కృష్ణ మేనేజ‌ర్‌గా పృథ్వీ త‌న‌దైన కామెడీ ఆక‌ట్టుకున్నారు. ఇక సీనియ‌ర్ న‌రేశ్ త‌న పాత్ర‌కు న్యాయం చేశారు. అయితే ఈ పాత్ర‌కు పెద్ద ప్రాముఖ్య‌త లేదు. మ‌దునంద‌న్‌, కేదారి శంక‌ర్, శత్రు త‌దిత‌రులు వారి వారి పాత్ర‌ల్లో చ‌క్క‌గా న‌టించారు. 

సాంకేతిక నిపుణులు:

ఇందులో ముందు మారుతి గురించి ప్ర‌స్తావించాలి. డిజార్డ‌ర్ సినిమాలు భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, మ‌హానుభావుడు చిత్రాల్లో ఎమోష‌న్ సీన్స్‌.. పాత్ర‌ల చిత్రీక‌ర‌ణ‌ను చ‌క్క‌గా రాసుకున్నారు. ఈ సినిమా విష‌యంలో అంత ఎఫ్టెక్ట్ క‌న‌ప‌డ‌లేదు. మారుతి సినిమాలో కామెడీ ప్ర‌ధాన బ‌లంగా ఉంటుంది. ఫ‌స్టాఫ్‌లో వెన్నెల‌కిషోర్  కామెడీ సీన్స్‌.. సెకండాఫ్‌లో వెన్నెల‌కిషోర్‌, పృథ్వీ కామెడీ పాత్ర లు కాసేపు న‌వ్విస్తాయి. అలాగేమారుతి సినిమాల్లో హీరో పాత్ర నుండి మెయిన్ కామెడీ జ‌న‌రేట్ అవుతుంటుంది. భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, మ‌హానుభావుడు సినిమాలను ఉదాహ‌ర‌ణ‌లుగా చెప్పుకోవ‌చ్చు. నిజార్ ష‌ఫీ సినిమాటోగ్ర‌ఫీ చాలా బావుంది. గోపీసుంద‌ర్ సంగీతం అందించిన పాట‌లు, నేప‌థ్య సంగీతం బావున్నాయి.  నిర్మాణ విలువ‌లు చాలా బావున్నాయి. సెకండాప్ లెంగ్త్ త‌గ్గించు ఉంటే బావుండేది. కామెడీ డోస్ మారుతి గ‌త చిత్రాల‌కంటే కాస్త త‌గ్గింద‌నాలి. 

ఫ‌స్టాఫ్ ల‌వ్ సీన్స్‌, హీరోయిన్ ఇగోయిస్ట్‌గా న‌టించ‌డం అంతా బాగానే ఉంటుంది. ఇక సెంక‌డాఫ్ అంతా రొటీన్ క‌మ‌ర్షియ‌ల్ సినిమా స్ట‌యిల్లోనే సాగింది. హీరోయిన్‌, ఆమె త‌ల్లి, హీరో తండ్రి ఇగోయిస్టిక్ పాత్ర‌లు.. హీరో పాజిటివ్ క్యారెక్ట‌ర్ అంటే సినిమాను బాగా తీసుంటే బావుండేదేమోన‌నిపించింది. సంద‌ర్భానుసారం వ‌చ్చే  డైలాగ్స్ ఆక‌ట్టుకున్నాయి. ఇక ర‌మ్య‌కృష్ణ‌, అను పాత్ర‌లు .. వాటి మ‌ధ్య ఇగో గొడ‌వ‌లు అన్ని ప్రేక్ష‌కుల‌ను న‌వ్విస్తాయి. ముఖ్యంగా సెకండాఫ్ ఫ్యామిలీ ఆడియెన్స్‌ను మెప్పిస్తుంది. 

బోట‌మ్ లైన్‌: పండగ ఫీస్ట్‌లా న‌వ్వించే 'శైల‌జారెడ్డి అల్లుడు'

Read Shailaja Reddy Alludu Movie Review in English

Rating : 3.0 / 5.0