ఎట్టకేలకు ఇంటికొచ్చిన ఆర్యన్ ఖాన్.. మన్నత్ వద్ద సంబరాలు
Send us your feedback to audioarticles@vaarta.com
డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి జైలులో వున్న బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ఎట్టకేలకు విడుదలయ్యారు. ఈ కేసులో ఆయనకు గురువారమే బెయిల్ వచ్చినప్పటికీ.. చట్టపరమైన లాంఛనాల వల్ల ఆర్యన్ జైలులోనే వున్నారు. ఇవి పూర్తి కావడంతో ఆయనను శనివారం జైలు నుంచి అధికారులు విడుదల చేశారు. కుమారుడి కోసం షారుఖ్ స్వయంగా జైలుకు వచ్చారు. అటు ఆర్యన్ వస్తున్నాడని తెలుసుకున్న అభిమానులు, ప్రజలు షారుఖ్ నివాసం మన్నత్ వద్దకు భారీగా చేరుకున్నారు.
మరోవైపు ఆర్యన్‌కు బెయిల్ మంజూరు చేసేందుకు న్యాయస్థానం కొన్ని షరతులు విధించింది. రూ.లక్ష విలువ చేసే బాండ్‌ను ఒకరు లేదా ఇద్దరు వ్యక్తులు పూచీకత్తుగా సమర్పించాలని కోర్టు ఆదేశించింది. దీంతో సినీనటి జూహీ చావ్లా షూరిటీగా సంతకం చేశారు. జూహీ జామీనును న్యాయస్థానం ఆమోదించింది. అనంతరం బెయిల్ పత్రాలను తీసుకుని షారుక్ న్యాయ బృందం నిన్న సాయంత్రం జైలుకు బయల్దేరినప్పటికీ అప్పటికే సమయం మించడంతో శనివారం ఉదయానికి విడుదల ప్రక్రియను పూర్తి చేశారు. దీంతో ఆర్యన్‌ను విడుదల చేశారు. 22 రోజుల తర్వాత ఆర్యన్ జైలు నుంచి బయటకు వచ్చాడు.
కాగా.. అక్టోబరు 2న ముంబై అరేబియా సముద్ర తీరంలో క్రూజ్‌లో రేవ్ పార్టీపై పోలీసులు, ఎన్సీబీ అధికారులు దాడులు చేశారు. ఈ సందర్భంగా ఆర్యన్‌తో పాటు మరో 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆర్యన్ అరెస్ట్‌ను అక్టోబర్ 3న ఎన్సీబీ అధికారి సమీర్ వాంఖడే ధ్రువీకరించారు. ఈ కేసులో ఆర్యన్ సహా నిందితులకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ ముంబయి ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దీంతో అక్టోబరు 8 నుంచి ఆర్యన్ ముంబయిలోని ఆర్థర్ రోడ్ జైలులో ఉన్నాడు. స్పెషల్ కోర్టు బెయిల్‌కు నిరాకరించడంతో ఆర్యన్ తరఫు న్యాయవాదులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ అనంతరం ఉన్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout