ఓటీటీ బిజినెస్‌లోకి షారుఖ్ ఖాన్.. యాప్ పేరేంటో తెలుసా..?

మిస్ అయిన సీరియల్స్, మంచి వెబ్ షోలు, థియేటర్లకు వెళ్లకుండానే కొత్త సినిమాలు ఇవన్నీ చూసేందుకు అందుబాటులో వచ్చినవే ఓటీటీలు. లాక్‌డౌన్ పుణ్యామా అని వీటికి ఎక్కడా లేని డిమాండ్ వచ్చి పడింది. ప్రస్తుతం ఓటీటీ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలు అన్నట్లు దూసుకుపోతోంది. బడా నిర్మాణ సంస్థలు, కార్పోరేట్ కంపెనీలు ఈ రంగంలోకి అడుగుపెట్టడం, ప్రేక్షకులు కూడా కోవిడ్ భయం.. టిక్కెట్ల ధరల కారణంగా ఓటీటీలకు మొగ్గుచూపుతుండడంతో వీటి మార్కెట్‌ రోజురోజుకీ పెరిగిపోతోంది.

ఈ క్రమంలోనే ఓటీటీ సంస్థల పోటీ కూడా అదే స్థాయిలో పెరిగింది. ఈ రంగంలో వున్న వృద్ధిని గమనించి అనేక మంది వ్యాపారవేత్తలు, సినీతారలు ఓటీటీ బిజినెస్‌లోకి దిగుతున్నారు. ఇప్పటికే తెలుగు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ‘‘ఆహా’’ ఓటీటీని ప్రారంభించి విజయవంతంగా నడుపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ లిస్ట్‌లోకి బాలీవుడ్ సూపర్ స్టార్, కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కూడా ఎంటరయ్యారు. ఈ సందర్భంగా తన ఓటీటీకి సంబంధించిన టైటిల్ ‘ఎస్ ఆర్ కే ప్లస్’ (SRK+) ను షారుఖ్ అనౌన్స్ చేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఒక పోస్టర్ షేర్ చేశారు.. త్వరలో (SRK+) ఓటీటీకి సంబంధించిన వివరాలను వెల్లడిస్తామన్నారు.

షారుఖ్ ఖాన్ పోస్ట్‌కు అభిమానులతో పాటు సల్మాన్ ఖాన్ స్పందిస్తూ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ‘ఈ రోజు పార్టీ మీపైనే ఉంది.. మీ కొత్త OTT SRK+కి అభినందనలు’ అంటూ సల్లూభాయ్ పేర్కొన్నారు. ప్రముఖ నిర్మాత అనురాగ్ కశ్యప్ సైతం SRK+కు సహకరిస్తున్నట్టు ఒక ట్వీట్‌లో వెల్లడించారు . అదేవిధంగా దర్శక నిర్మాత కరణ్ జోహార్ కూడా షారుఖ్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఇది OTT రూపురేఖలను మార్చబోతోంది అంటూ ట్వీట్ చేశారు.