Shaadi Mubarak Review
లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ అంటే ఏంటి? ఒకరంటే ఒకరికి తెలియని లేదా ఒకరినొకరు ఇష్టపడని హీరో, హీరోయిన్ చేసే ప్రయాణంలో ఒకరంటే ఒకరికి ప్రేమ ఏర్పడటం.. తర్వాత పరిస్థితులు ప్రభావంతో ఇద్దరూ విడిపోవడం. హీరోయిన్ మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకోవడం తర్వాత కలిసి పోవడం. ఇది రొటీనే అయితే కథను చక్కగా హ్యాండిల్‌చేస్తే ఈ కథే ప్రేక్షకులను మెప్పించే సినిమా అవుతుంది. మా సినిమా ‘షాదీ ముబారక్’ కచ్చితంగా ఆడియెన్స్‌కు కనెక్ట్ అవుతుందని అంటున్నాడు నిర్మాత దిల్‌రాజు. ఓ చిన్న సినిమా కంటెంట్ నచ్చడంతో నిర్మాణంలో భాగస్వామి అయిన దిల్‌రాజు, తనకున్న ఐడియాలజీతో, ప్రమోషనల్ స్ట్రాటజీతో ‘షాదీ ముబారక్’ సినిమాకు కావాల్సినంత హైప్‌ను క్రియేట్ చేసుకున్నాడు. బుల్లితెరపై ఆర్.కె.నాయుడు అనే మాస్ ఇమేజ్ ఉన్న వీర్ సాగర్, సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తర్వాత మాస్ ఇమేజ్ కోసం ట్రై చేసి వర్కవుట్ కాకుండా, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దగ్గరయ్యే క్రమంలో చేసిన సినిమానే ‘షాదీ ముబారక్’. మరి షాదీ ముబారక్ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంది? అనే విషయం తెలియాలంటే ముందు కథలోకి వెళదాం..
కథ:
హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన యువకుడు సున్నిపెంట మాధవ్(వీర్ సాగర్) ఉద్యోగ్య రీత్యా ఆస్ట్రేలియా వెళతాడు. చాలా రోజుల తర్వాత పెళ్లి చూపుల కోసం ఇండియా వస్తాడు. మాధవ్ ఇక్కడ పెళ్లిచూపుల కోసం ఓ మ్యారేజ్ బ్యూరోను సంప్రదించి ఉంటాడు. మాధవ్‌ను పెళ్లి చూపులకు తీసుకెళ్లాల్సిన సదరు మ్యారేజ్ బ్యూరో హెడ్(రాజశ్రీ నాయర్) అనుకోకుండా రాలేని పరిస్థితి క్రియేట్ అవుతుంది. దాంతో ఆమె తన కుమార్తె తుపాకుల సత్యభామ(దశ్య రఘునాథ్)ను మాధవ్‌కు తోడుగా పంపుతుంది. అలా మాధవ్ పెళ్లిచూపులకు తోడుగా బయలుదేరిన సత్యభామ ఈ జర్నీలో ఒకరంటే ఒకరు ఎలా ఇష్టపడతారు? ఇద్దరి మధ్య ప్రేమకు దారి తీసే పరిస్థితులేంటి? ఒకరంటే ఒకరికి ఇష్టమున్న పరిస్థితుల్లో ఎందుకు విడిపోతారు? చివరకు ఒక్కటయ్యారా? లేదా? అనే విషయాలను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
సమీక్ష:
లవ్‌స్టోరి అని చెబితే రొటీన్‌గానే అనిపిస్తుంది. అయితే కథను చక్కగా హ్యాండిల్ చేస్తే ప్రేక్షకుడికి లవ్‌స్టోరి కనెక్ట్ అయినట్లు మరో సినిమా కనెక్ట్ కాదనడంలో సందేహం లేదు. దర్శకుడు పద్మశ్రీ రైటర్‌గా తన పనితనాన్ని చక్కగా ఎలివేట్ చేయడంతో ‘షాదీముబారక్’ సినిమా ఎంటర్‌టైనింగ్ పంథాలో సాగుతుంది. సినిమా ప్రారంభం నుంచి ప్రీ క్లైమాక్స్ ముందు వరకు.. అంటే డెబ్బై శాతం సినిమాను ప్రేక్షకుడు ఓస్మైల్‌తో చూస్తాడనడంలో డౌట్ లేదు. అందుకు కారణం దర్శకుడనే చెప్పాలి. సన్నివేశాలు రొటీన్‌గా ఇది వరకు సినిమాల్లో చూసినట్లే అనిపించినా, మంచి సంభాషణలతో ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోషనల్ డైలాగ్స్‌ను సందర్భానుసారం జోడించి సినిమాను రక్తి కట్టించాడు. హీరోయిన్‌కి ఆమె తండ్రి తను చూసిన మరో తండ్రి ప్రేమ కథను ఎమోషనల్ కనెక్టింగ్‌పాయింట్‌లో చెప్పడం, హీరోని హీరోయిన్ ఇష్టపడటానికి తను చెప్పే లెక్చరర్ ఎమోషనల్ లవ్‌స్టోరి ఇవన్నీ ప్రేక్షకుడికి కనెక్ట్ అవుతాయి. సునీల్ కశ్యప్ అందించిన సంగీతంలో పాటలన్నీ మాంటేజ్ సాంగ్స్.. మంచి లిరిక్స్‌తో కథలో భాగంగానే సాగిపోతుంది. ఎక్కడా హీరో, హీరోయిన్స్ విరగపడి ఫ్లోర్ స్టెప్స్ వేసే పరిస్థితులు లేవు. కాబట్టి పాటలు అలా సాగిపోతాయి. నేపథ్య సంగీతం కూడా బావుంది. శ్రీకాంత్ నారోజ్, జవహర్ రెడ్డి సినిమాటోగ్రఫీ బావుంది. హైదరాబాద్‌లో మనం చూసే లొకేషన్స్ ఉన్నా కూడా వాటిని చక్కగా ఎలివేట్ చేశారు. మధు కూర్పు కూడా ఓకే.
ఇక నటీనటుల విషయానికి వస్తే మాస్ ఇమేజ్‌కు భిన్నంగా వీర్‌సాగర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. లుక్ విషయంలో సాగర్ తీసుకున్న జాగ్రత్త తెరపై చక్కగా కనపడుతుంది. ఎక్కడా భారీ డైలాగ్స్ లేవు. సాగర్ తన పాత్రలో సున్నిపెంట మాధవ్‌గా చక్కగా ఒదిగిపోయాడు. ఇక తుపాకుల సత్యభామగా దశ్యా రఘునాథ్ మెప్పించింది. తొలి చిత్రమే అయినా ఆ ఫీలింగ్ ఎక్కడా రానీయకుండా దశ్య పడ్డ కష్టం మనకు తెరపై కనిపిస్తుంది. హీరోయిన్ పాత్రను ఆమె క్యారీ చేసిన తీరుకే హీరో పాత్రకు బలంగా మారింది. ఇక హీరో తల్లిదండ్రులుగా హేమ, బెనర్జీ, హీరోయిన్ తల్లిదండ్రులుగా రాజశ్రీ నాయర్, రామ్ వారి వారి పాత్రల్లో చక్కగా చేశారు. పోలీస్‌గా అజయ్ ఘోష్, హీరో స్నేహితుడు బంతిబాలుగా భద్రమ్, కారు డ్రైవర్ పాత్రలో రాహుల్ రామకృష్ణ చేసిన పాత్రలు మంచి కామెడీని జనరేట్ చేశాయి. ముఖ్యంగా ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యే కామెడీ అని చెప్పాలి. శత్రు సహా మిగిలిన నటీనటులందరూ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు.
ఇది లవ్‌స్టోరి.. హీరో, హీరోయిన్ ప్రేమించుకోవడం గొడవపడటం.. పరిస్థితులను అర్థం చేసుకుని కలిసిపోవడం. రొటీన్ లవ్‌స్టోరి. అలాగే కమర్షియల్ సినిమాలను, డాన్సులు, ఫైట్స్‌ను ఇష్టపడే వారికి ఈ సినిమా కనెక్ట్ కాకపోవచ్చు. అయితే మంచి లవ్ అండ్ ఫ్యామిలీ మూవీగా ఓ స్మైల్‌తో సినిమాను చూసి ఎంజాయ్ చేయవచ్చు
బోటమ్ లైన్: ‘షాదీ ముబారక్’.. రొటీన్ కథే కానీ.. చూస్తున్నంత ఓ చిరునువ్వుతో ఎంజాయ్ చేసే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్
- Read in English