సెక్స్ వర్కర్లూ మనుషులే.. వ్యభిచారం కూడా వృత్తే : పోలీసులు, మీడియాకు సుప్రీం వార్నింగ్
Send us your feedback to audioarticles@vaarta.com
సెక్స్ వర్కర్లకు సంబంధించి సుప్రీంకోర్టు గురువారం సంచలన తీర్పు వెలువరించింది. సెక్స్ వర్కర్లూ మామూలు మనుషులేనని... వారికి తగిన గౌరవమివ్వాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ వారిపై వేధింపులకు పాల్పడరాదు అని పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది. మనుషుల మర్యాదకు కనీస భద్రత కల్పించడం బాధ్యతగా గుర్తించాలని సూచించింది. సెక్స్ వర్కర్లకు గౌరవం, భద్రత కల్పించడానికి చట్టమేదీ లేదని.. అందుకే తాము జోక్యం చేసుకుంటున్నామని సుప్రీం స్పష్టం చేసింది.
మా సిఫారసులు అమలు చేయండి: రాష్ట్రాలకు ఆదేశం
సెక్స్‌వర్కర్లపై వేధింపులపై 2016లో దాఖలైన వ్యాజ్యంపై జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ బి.ఆర్.గావై, జస్టిస్ ఎ.ఎస్.బోపన్నతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపడుతూ ఈ వ్యాఖ్యలు చేసింది. సెక్స్ వర్కర్లకు సంబంధించి సుప్రీంకోర్టు ప్యానెల్ సిఫార్సులను అమలు చేయాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. వేధించడం, దూషించడం గానీ, భౌతికంగా గానీ సెక్స్‌వర్కర్ల మీద దాడి చేసే హక్కు గానీ పోలీసులకు ఉండదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. సెక్స్ వర్కర్ల పనిని ‘‘వృత్తి’’గా గుర్తించే ముఖ్యమైన క్రమంలో.. చట్ట ప్రకారం గౌరవం, సమాన రక్షణకు వారు అర్హులని ధర్మాసనం తేల్చి చెప్పింది.
వ్యభిచారం కూడా వృత్తే:
వ్యభిచారం అనేది కూడా ఒకే వృత్తి అని, చట్ట ప్రకారం సెక్స్ వర్కర్లు గౌరవంతో జీవించేలా వారికి రక్షణ ఉండాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. లైంగిక వేధింపుల నుంచి బయటపడిన సెక్స్ వర్కర్లకు చట్టానికి అనుగుణంగా తక్షణ వైద్య సహాయంతో సహా అన్ని సౌకర్యాలను అందించాలని ఆదేశించింది. సెక్స్ వర్కర్ల పట్ల పోలీసుల వైఖరి తరచుగా క్రూరంగా, హింసాత్మకంగా ఉంటుందని గమనించామని.. తమ హక్కులకు గుర్తింపు లభించని వర్గం వారు అని సుప్రీంకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 21లో పేర్కొన్న విధంగా దేశంలోని ప్రతి పౌరుడికి గౌరవంతో జీవించే హక్కు ఉందని ధర్మాసనం గుర్తుచేసింది. సెక్స్ వర్కర్లను వేధించకూడదని, వారిని అరెస్ట్ చేయకూడదని ఆదేశించింది. ఆ వృత్తిలో ఉన్నదనే ఏకైక కారణంతో సెక్స్ వర్కర్ పిల్లలను తల్లి నుంచి వేరుచేయరాదని ... వారి పట్ల వివక్ష చూపించరాదని సుప్రీంకోర్ట్ స్పష్టం చేసింది.
మీడియా ఓవరాక్షన్ చేయొద్దు:
తమ ఇష్టానికి వ్యతిరేకంగా నిర్బంధించిన వయోజన మహిళల కేసులను సమీక్షించి, వారిని గడువులోగా విడుదల చేసేందుకు వీలుగా షెల్టర్ హోమ్‌లను సర్వే చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. సెక్స్ వర్కర్లు వారి ఆరోగ్యం, భద్రత కోసం ఉపయోగించే కండోమ్‌ల వాడకాన్ని నేరాలుగా పరిగణించరాదని తేల్చిచెప్పింది. అలాగే అరెస్టులు, దాడులు, రెస్క్యూ ఆపరేషన్ల సమయంలో బాధితులుగా లేదా నిందితులుగా ఉన్న సెక్స్ వర్కర్ల గుర్తింపును బహిర్గతం చేయకుండా మీడియా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. దీనికోసం ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తగిన మార్గదర్శకాలను విడుదల చేయాలని ధర్మాసనం ఆదేశించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ద్వారా సంక్రమించిన అధికారాన్ని ఉపయోగించుకొని సుప్రీంకోర్టు ఈ మేరకు పోలీసులకు, మీడియాకు ఆదేశాలిచ్చింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments