రాసలీలల కేసు.. అజ్ఞాతంలోకి మాజీ మంత్రి జార్కిహోళి

  • IndiaGlitz, [Thursday,April 01 2021]

కర్ణాటక రాజకీయాలలో మాజీ మంత్రి రమేశ్‌ జార్కిహోళి రాసలీలల వ్యవహారం దుమారం రేపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన అరెస్ట్ భయాన్ని ఎదుర్కొంటున్నారు. ఇంతకాలంగా కనిపించని సీడీలోని యువతి సడెన్‌గా అజ్ఞాతాన్ని వీడి మంగళవారం కోర్టులో లొంగిపోయింది. జడ్జికి వాంగ్మూలం ఇచ్చింది. అనంతరం బుధవారం ఆమెను సిట్ పోలీసులు సైతం విచారించారు. అటు తన వాంగ్మూలంలోనూ.. ఇటు సిట్ విచారణలోనూ రమేశ్ జార్కిహోళి తనను లైంగికంగా వేధించినట్టు.. తన బెదిరింపులకు గురి చేసినట్టు మహిళ వెల్లడించినట్టు తెలుస్తోంది.

దీంతో ఇక తనకు అరెస్ట్ తప్పదనుకున్న జార్కిహోలి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే ఆయన ముంబైకి వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. ఆయన ప్రస్తుతం ఎవరికీ అందుబాటులో లేరు. ఇప్పటి వరకూ తాను ఏ తప్పూ చేయలేదని.. సీడీ వీడియోలన్నీ అభూత కల్పనలని చెబుతూ వచ్చిన జార్కిహోళి యువతి అజ్ఞాతాన్ని వీడటంతో భయపడి పోయినట్టు తెలుస్తోంది. మరోవైపు ఆమె ఇచ్చిన వాంగ్మూలం అన్నీ కలగలిపి ఆయనలో మరింత భయాన్ని రేపాయి. దీంతో వెంటనే ఆయన ఢిల్లీ నుంచి న్యాయవాదులను రప్పించుకుని మంతనాలు చేసినట్టు సమాచారం.

ఢిల్లీకి చెందిన నలుగురు న్యాయవాడులతో పాటు కర్ణాటకకు చెందిన మరో ఇద్దరితోనూ చర్చించినట్టు తెలుస్తోంది. తనపై ఉన్న ఎఫ్ఐఆర్ రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ వేయాలని నిర్ణయించారు. ఇదొక బ్లాక్ మెయిల్ అని.. దీని వెనుక బడా నేతల హస్తముందని గతంలో మాజీ సీఎం ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. దీని వెనుక కోట్ల రూపాయల డీల్ జరిగిందని సైతం ఆరోపించారు. మరి మున్ముందు ఈ వ్యవహారం ఇంకెన్ని మలుపులకు దారి తీయనుందో వేచి చూడాలి.