మరో 72 గంటల పాటు అతి భారీ వర్షాలు..
- IndiaGlitz, [Tuesday,October 13 2020]
హైదరాబాద్‌కు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. మరో 72 గంటలపాటు అతి భారీ వర్షాలు కురవనున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ ప్రకటన విడుదల చేశారు. కొన్ని చోట్ల 9 నుండి 16 సెంటిమీటర్ల అతిభారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని లోకేష్ కుమార్ వెల్లడించారు. వాతావరణశాఖ హెచ్చరికలతో ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసింది. మాన్ సూన్ బృందాలు అలర్ట్‌గా ఉండాలని లోకేష్‌కు కుమార్ ఆదేశించారు.
లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని.. ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని అధికారులకు లోకేష్ కుమార్ సూచించారు. అదేవిధంగా ఆయా ప్రాంతాల్లో రిలీఫ్ సెంటర్లుగా గుర్తించిన పాఠశాలలో, కమ్యునిటీహాల్స్, ఇతర వసతులను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు మంత్రి కేటీఆర్ నగరంలో శిథిలావస్థలో ఉన్న భవనాలకు నోటీసులు ఇచ్చి.. అందులో ఉన్నవాళ్లను ఖాళీ చేయించాలని అధికారులను ఆదేశించారు. అప్రమత్తంగా ఉండాలని టౌన్ ప్లానింగ్ సిబ్బందికి సైతం సూచించారు.
కాగా.. నేటి ఉదయం నుంచి హైదరాబాద్‌లో భారీగా వర్షం కురుస్తూనే ఉంది. ఎల్బీ నగర్, ఉప్పల్, నాగోల్, బేగంపేట, కోఠి, మెహదీపట్నం, మణికొండ, బంజారాహిల్స్‌తో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. దీంతో రోడ్లపై చాలా చోట్ల నీళ్లు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది.