స్టాలిన్ మంత్రివర్గంలో ఏడుగురు తెలుగు వారికి ప్రాధాన్యం..

తమిళనాడు ముఖ్యమంత్రిగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ శుక్రవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. స్టాలిన్‌ చేత గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌ ఈ ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే మంత్రి పదవులు లభించిన 34 మంది సైతం నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. తమిళనాడులో మొత్తం 234 స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. డీఎంకే కూటమి 156 సీట్లను గెల్చుకుని ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేసుకుంది. అన్నాడీఎంకే కూటమికి 78 సీట్లు లభించాయి. దీంతో రాష్ట్రంలో దశాద్దకాలం తర్వాత డీఎంకే ప్రభుత్వం ఏర్పాటైంది. ఇదిలావుంటే.. బుధవారం కొత్తగా ఎన్నికైన డీఎంకే శాసనసభ్యుల సమావేశం ఆ పార్టీ ప్రధాన కార్యాలయమైన అన్నా అరివాయంలో జరిగింది.

Also Read: తమిళనాడులో కొలువుదీరిన స్టాలిన్ సర్కార్..

ఇందులో శాసనసభాపక్ష నేతగా ఎంకే స్టాలిన్‌ను ఎన్నుకున్నారు. ఆ తర్వాత స్టాలిన్ వెళ్లి రాష్ట్ర గవర్నరును రాజ్‌భవన్‌లో కలుసుకుని, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరారు.

పలు సామాజిక వర్గాలకు ప్రాధాన్యం

కాగా.. ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఏడుగురు తెలుగు వారు ఉండటం విశేషం. కేఎన్‌ నెహ్రూ, ఈవీ వేలు, కేకేఎస్‌ఎస్‌ఆర్‌ రామచంద్రన్‌, కె.పొన్ముడి, ఆర్‌.గాంధీ, పీకే శేఖర్‌బాబు, ఎం.సుబ్రమణ్యంలను కీలకమైన పదవులు వరించాయి. అలాగే స్టాలిన్‌ మంత్రివర్గంలో 14 మంది పాత కాపులకు మళ్లీ అవకాశం లభించడం విశేషం. వీరు 2006లో కొలువుదీరిన కరుణ కొలువులోనూ మంత్రులుగా పనిచేయడం విశేషం. స్టాలిన్‌ మంత్రివర్గంలో పలు సామాజికవర్గాలకు ప్రాధాన్యం లభించింది. ఇందులో దళితులు ముగ్గురు, వన్నియార్లు ముగ్గురు, కొంగు వేళాలర్‌ నలుగురు, ముక్కులత్తోర్‌ నలుగురు, నాడార్లు ముగ్గురు, నాయుళ్లు ముగ్గురు, రెడ్డియార్లు ఇద్దరు, యాదవులు ఇద్దరు, ముస్లింలు ఇద్దరు, ఉడయార్‌ ఒకరు, పిళ్లై ఒకరు, మత్స్యకారు ఒకరు, శెట్టియార్‌ ఒకరు, ముత్తైరయ్యర్‌ ఒకరు, పడవర్‌ ఒకరు, ముదలియార్‌ ఒకరు, ఇసై వేళాలర్‌ ఒకరు ఉన్నారు.

ధనవంతుల సంఖ్య అధికం..

రాష్ట్ర శాసనసభకు కొత్తగా ఎన్నికైన 234 మంది ఎమ్మెల్యేల నేర చరిత్ర, విద్యార్హతలపై డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ ఆరా తీసింది. ఇందులో అనేక ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా కొత్త శాసనసభ్యుల్లో 137 మందిపై వివిధ రకాలైన క్రిమినల్‌ కేసులున్నట్టు డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ తెలిపింది. 77 మంది కొత్త ఎమ్మెల్యేలు పాఠశాల విద్యను మాత్రమే పూర్తి చేశారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. కొత్త ఎమ్మెల్యేల్లో ఎక్కువమంది ధనవంతులే ఉన్నారు. 2016తో పోల్చితే ధనవంతుల సంఖ్య అధికంగా ఉన్నట్టు తేలింది. ఈ కోటీశ్వరుల్లో డీఎంకే తరపున 89 శాతం, అన్నాడీఎంకే తరపున 88 శాతం మంది ఉన్నారు. కాంగ్రెస్‌ సభ్యుల్లో 58 శాతం, పీఎంకే తరపున 60 శాతం, బీజేపీ తరపున 75 శాతం మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులని ఈ సంస్థ వెల్లడించింది. గత 2016లో ఎన్నికైన సభ్యుల్లో 76 మంది కోటీశ్వరులు ఉండగా, ఇప్పుడు ఈ సంఖ్య 86కు పెరిగింది.