Ruby Hotel Secunderabad : సికింద్రాబాద్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఏడుగురు మృతి,

  • IndiaGlitz, [Tuesday,September 13 2022]

సికింద్రాబాద్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. సోమవారం అర్ధరాత్రి స్థానిక పాస్‌పోర్ట్ కార్యాలయం సమీపంలో వున్న రూబీ లగ్జరీ ఫ్రైడ్ హోటల్‌లో ఘటన సంభవించింది. దీని కింద వున్న సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్లలో రూబీ ఎలక్ట్రిక్ వాహనాల షోరూం వుంది. నాలుగు అంతస్తుల్లో హోటల్ నిర్వహిస్తున్నారు. సోమవారం రాత్రి 9.40 గంటల ప్రాంతంలో కింద వున్న ఎలక్ట్రిక్ షోరూం షోరూంలో మంటలు చెలరేగాయి. అగ్నికీలల ధాటికి ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు పేలడంతో మంటల ఉద్ధృతి పెరిగింది. నిమిషాల వ్యవధిలోనే ఇతర వాహనాలకు మంటలు అంటుకుని మెట్ల మార్గం ద్వారా పై అంతస్తుల్లో వున్న లాడ్జికి వ్యాపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు.

పొగకు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరై:

అప్పటికే దట్టమైన పొగ కారణంగా లాడ్జిలో వున్న వారు ఉక్కిరిబిక్కిరై స్పృహ కోల్పోయారు. పొగతో పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో తప్పించుకోవడానికి వీలు లేకుండా పోయింది. మంటలను అదుపు చేసిన అనంతరం పై అంతస్తులోకి వెళ్లిన అగ్నిమాపక సిబ్బంది, ఇతర సహాయక బృందాలు వీరిని రక్షించి గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మృతుల్లో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మంటలు అంటుకుని ప్రాణాలు కాపాడుకునే యత్నంలో కిందకి దూకి ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

ఘటనాస్థలికి చేరుకున్న మంత్రులు :

అగ్ని ప్రమాదం విషయం తెలుసుకున్న మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే సాయన్నలు అక్కడికి చేరుకుని సహాయక చర్యలను పరిశీలించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వారు అధికారులను ఆదేశించారు. అయితే చుట్టుపక్కల వున్న భవనాల్లోని ప్రజలను ముందే ఖాళీ చేయించడం, మంటలను వేగంగా అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది.