Bus Accident:పెళ్లింట పెను విషాదం : ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురి దుర్మరణం
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు దుర్మరణం పాలవ్వగా.. 18 మంది గాయపడ్డారు. పెళ్లి బృందంతో పొదిలి నుంచి కాకినాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు సోమవారం అర్ధరాత్రి దాటాక దర్శి సమీపంలో సాగర్ కాల్వలోకి దూసుకెళ్లింది. బస్సు తలకిందులుగా పడటంతో ప్రయాణీకులు ఒకరిపై ఒకరు పడి ఊపిరాడక ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఎదురుగా వస్తున్న బస్సును తప్పించబోయి ఈ ప్రమాదం చోటు చేసుకుందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. మరణించిన వారిని అబ్ధుల్ అజీజ్, అబ్ధుల్ హని, షేక్ రమీజా, ముల్లా నూర్జహన్, ముల్లా జానీబేగం, షేక్ షబీనా, షేక్ హీనాలుగా గుర్తించారు. మృతురాలు షేక్ రమీజా భర్త చెన్నైలో డీఎస్పీగా పనిచేస్తున్నారు. ఆయన బస్సులో కాకుండా రైళ్లో వెళ్లడంతో ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది వున్నట్లు సమాచారం. వివాహ రిసెప్షన్ కోసం పెళ్లి బృందం ఆర్టీసీ బస్సును అద్దెకు తీసుకుంది. డ్రైవర్ నిద్ర మత్తులో వుండటంతోనే ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది.
మరోవైపు ప్రకాశం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ఏపీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన ఆయన.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. అంతకుముందు ప్రమాదస్థలిని జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ పరిశీలించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout