తండ్రీకొడుకులు పాదం మోపారు.. వరుణుడు పారిపోయాడు, సెంటిమెంట్ దెబ్బకు జనం గగ్గోలు

  • IndiaGlitz, [Thursday,August 31 2023]

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేరు గుర్తుచేసుకుంటే.. ఆయన హైటెక్ పాలనతో పాటు వర్షాలు కూడా గుర్తొస్తాయి. దురదృష్టమో, శాపమో తెలియదు గానీ చంద్రబాబు రాష్ట్ర పగ్గాలు చేపట్టిన ప్రతిసారి వర్షాలు ముఖం చాటేసేవి. ఏదో ఒకసారి , రెండు సార్లు అనుకుంటే ఏదోలే అనుకోవచ్చు. కానీ ప్రతిసారి ఇదే తంతు. 1999-2004 మధ్య ఉమ్మడి రాష్ట్ర ప్రజలు వర్షాలు లేక ఎన్ని ఇబ్బందులు పడ్డారో ప్రతి ఒక్కరికి తెలుసు. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లుగా కరువుతో అల్లాడుతోన్న ప్రజలకు షాకిచ్చేలా కరెంట్ ఛార్జీలు పెంచారు చంద్రబాబు. తమపై కాస్త దయ చూపండి అన్నందుకు బషీర్‌బాగ్‌లో గుర్రాలతో తొక్కించి, జనాన్ని పిట్టల్లా కాల్చి చంపించారు బాబు.

వైఎస్ఆర్ హయాంలో సమృద్ధిగా వర్షాలు :

గతంలో వర్షాలు బాగా పడితే వరుణ దేవుడు తన పార్టీలో చేరాడని కాంగ్రెస్ నేతలు పాజిటివ్‌గా ప్రచారం చేసుకునేవారు. చంద్రబాబు మాత్రం స్వయంగా వరుణ దేవుడే తాముతెచ్చిన రెయిన్ గన్స్‌కు భయపడి వర్షాలు కురిపిస్తున్నాడంటూ వానదేవుడినే భయపెట్టేలా మాట్లాడేవారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన కుమారుడు వైఎస్ జగన్‌లు సీఎంలుగా వున్నప్పుడు సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండి ప్రజలు సంతోషంగా వున్నారు. అయితే ఇప్పుడు మళ్లీ సీన్ రివర్స్ అయ్యింది. జూలైలో పడిన వర్షాలు మళ్లీ ఇటువైపు తొంగి చూడలేదు. దాదాపు 100 ఏళ్ల తర్వాత ఆగస్ట్ నెలలో వర్షాలు లేకపోవడం ఇదే తొలిసారి. పరిస్ధితి ఇలాగే కొనసాగితే సాగు, తాగు నీరు లేక ప్రజలు అల్లాడిపోయే పరిస్ధితి వుంది.

చంద్రబాబు , లోకేష్‌ల రాకతోనే వర్షాలు మాయమైపోయాయంటున్న జనం:

దీనికి తండ్రీకొడుకుల పాద మహిమే కారణమని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. కరోనా సమయంలో చంద్రబాబు, లోకేష్‌లు హైదరాబాద్‌కే పరిమితం కావడంతో దాదాపు నాలుగేళ్లు పాటు వర్షాలు బాగా పడ్డాయి. అయితే ఇప్పుడు ఎన్నికల సీజన్ కావడంతో తండ్రీకొడుకులు మళ్లీ రోడ్డెక్కారు. ఒకరేమో యువగళం పాదయాత్ర చేస్తుంటే.. బాబు గారు ప్రాజెక్ట్‌ల సందర్శన చేస్తున్నారు. వీరు రాష్ట్రంలో అడుగుపెట్టగానే వరుణదేవుడు భయపడ్డాడో లేక సెంటిమెంటో కానీ వర్షాలు ముఖం చాటేశాయి. చినుకుల కోసం ప్రజలు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. వర్షాలు లేకపోవడంతో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. నిజం చెప్పాలంటే ఎండాకాలం కంటే ఎక్కువగా భానుడు నెత్తిపగుల గొడుతున్నాడు.

అడుగంటిన జలాశయాలు, బీటలు ఇచ్చిన పొలాలు :

ఇటీవల కురిసిన వర్షాలకు ఎగువ రాష్ట్రాల నుంచి వరద రావడంతో గోదావరి పోటెత్తింది. దీంతో ఆ నీటిని ఇటువైపు మళ్లించడంతో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలకు ప్రస్తుతానికి సాగునీటికి ఇబ్బంది లేకుండా పోయింది. కానీ శ్రీశైలం, నాగార్జున సాగర్ పరిధిలోని ఆయకట్టులో తీవ్ర పరిస్ధితులు నెలకొన్నాయి. ఇప్పటికే పొలాలు బీడు భూములుగా మారగా, ప్రాజెక్ట్‌ల్లో నీరు అడుగంటింది. వాతావరణ శాఖ లెక్కల ప్రకారం సెప్టెంబర్‌లోనూ ఇవే పరిస్ధితులు నెలకొంటాయన్న నివేదికల నేపథ్యంలో ప్రజలు భయపడుతున్నారు. వర్షాలు పడాలంటూ జనం దేవుళ్లకు మొక్కుతున్నారు. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్‌లపై మీమ్స్ వస్తున్నాయి.