రికార్డ్ బ్రేక్ చేసిన సెన్సెక్స్.. చరిత్రలో తొలిసారి ఇలా..
Send us your feedback to audioarticles@vaarta.com
దేశీయ స్టాక్ మార్కెట్లలో లాభాల జోరు కొనసాగుతోంది. సోమవారం నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం జోష్ కనిపించింది. ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను తగ్గించవచ్చని నిపుణులు అంచానాలు వేస్తుండటంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ మరింత బలపడింది. మరోవైపు అంతర్జాతీయంగా కూడా సానుకూలతలు ఉండటంతో లాభాల జోరుకు బాగా కలిసొచ్చింది. ఈ నేపథ్యంలో సెన్సెక్స్ సరికొత్త చరిత్ర సృష్టించింది. కాగా.. చరిత్రలో ఇలా 39వేల మార్కును అధిగమించడం తొలిసారి కావడం విశేషమని చెప్పుకోవచ్చు.
హిస్టరీ రిపీట్..
ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 185 పాయింట్లు పెరిగి 39,057కి చేరుకుంది. నిఫ్టీ 44 పాయింట్లు పుంజుకుని 11,713కు ఎగబాకింది. కాగా.. సెన్సెక్స్ విలువ 1985లో 400 పాయింట్ల స్థాయిలో ఉండగా, అదే సంవత్సరం సెన్సెక్స్ చరిత్రలోనే అత్యధికంగా 94 శాతం రిటర్న్స్ ఇచ్చింది. అదే సమయంలో 2008 సంవత్సరంలో 20 వేల స్థాయి నుంచి 50 శాతం కన్నా ఎక్కువగా పతనమై 9,600 పాయింట్లకు పడిపోయింది.
అమితంగా ఆకట్టుకున్న షేర్స్...
మెటల్, ఆటో రంగాల షేర్లు మదుపరులను అమితంగా ఆకట్టుకున్నాయి. మరోవైపు ఐటీ, టెక్నాలజీ, టెలికం, ఇంధన, మౌలిక రంగాల షేర్లూ రాణించాయి. టాటా మోటార్స్, వేదాంత, భారతీ ఎయిర్టెల్, మారుతి, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా స్టీల్, లార్సెన్ అండ్ టూబ్రో, హెచ్సీఎల్ టెక్ తదితర షేర్లు పెద్ద ఎత్తున లాభాలను అందుకోగలిగాయి. ఈ షేర్ల విలువ గరిష్ఠంగా 7.37 శాతం పుంజుకున్నది. మరోవైపు ఇన్ఫోసిస్, టీసీఎస్, ఎస్బీఐ, ఐటీసీ, యెస్ బ్యాంక్, కొటక్ బ్యాంక్, హీరో మోటోకార్ప్, కోల్ ఇండియా షేర్ల విలువా చెప్పుకోదగ్గ స్థాయిలోనే పెరిగింది.
గ్లోబల్ మార్కెట్ల మద్దతు
చైనా షాంఘై ఇండెక్స్ 2.58%, హాంకాంగ్ హ్యాంగ్సెంగ్ 1.66%, జపాన్ నిక్కీ 1.43 %, దక్షిణ కొరియా కోప్సీ 1.29% మేర లాభపడ్డాయి. గ్లోబల్ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ ముడి చమురు ధర 68.66 డాలర్లు పలికింది.
రిలయన్స్ విషయానికొస్తే...
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) మార్కెట్ విలువ రూ.9 లక్షల కోట్లకు చేరువ కావడం విశేషమనే చెప్పుకోవచ్చు. సోమవారం ఒక్కరోజే బీఎస్ఈలో 2.09 శాతం లాభపడి రూ.1,391.55 వద్ద స్థిరపడిన ఆర్ఐఎల్ షేర్ విలువ.. ఎన్ఎస్ఈలో 2 శాతం పెరిగి రూ.1,391.85 వద్ద నిలిచింది. దీంతో బీఎస్ఈలో ఈ ఒక్కరోజే సంస్థ మదుపరుల సంపద రూ.18,083.94 కోట్లు ఎగిసి రూ.8,82,060.94 కోట్లకు చేరింది. మొత్తానికి చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్లు.. కొత్త ఆర్థిక సంవత్సరాన్ని దూకుడుగా ప్రారంభించాయని చెప్పుకోవచ్చు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments