Viveka:వివేకా హత్య కేసుపై కడప కోర్టు సంచలన తీర్పు.. ఆ నేతలకు భారీ షాక్..
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలో ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. అధికార, విపక్ష నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష నేతలు ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసును ప్రస్తావిస్తున్నారు. వివేకా హంతకులను సీఎం జగన్ కాపాడుతున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా కడపలో ప్రచారం చేస్తున్న పీసీసీ చీఫ్ వైయస్ షర్మిల, సునీతా రెడ్డి అయితే వివేకా హత్యకు కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డినే కారణమని ఆరోపిస్తున్నారు. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కూడా ఇదే అంశాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.
దీంతో తమ పార్టీ నేతలను ఇరుకున పెట్టేలా రాజకీయ నేతలు పదే పదే వివేకా హత్య కేసు గురించి ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతున్నారని.. తద్వారా ప్రజలు అయోమయానికి గురవుతున్నారని వైసీపీ నేత సురేష్ బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. పిటిషనర్ తరఫున నాగిరెడ్డి వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం కీలక తీర్పు వెల్లడించింది. ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య ప్రస్తావన తీసుకురావద్దని షర్మిలతో పాటు చంద్రబాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి, పవన్ కల్యాణ్, నారా లోకేష్, సునీతారెడ్డిలకు ఆదేశాలు జారీ చేసింది.
కాగా కొద్ది రోజులుగా వివేకా హత్య కేసు ఎన్నికల ప్రచారంలో ప్రధాన అజెండాగా మారిపోయింది. ప్రతిపక్ష నేతలు ఈ కేసును ప్రస్తావిస్తూ సీఎం జగన్‌పై నేరుగా ఆరోపణలు చేస్తున్నారు. వివేకా హత్యలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి హస్తం ఉందని.. ఆయనకు జగన్ అండగా నిలుస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. దీంతో ప్రజల్లో వివేకా హత్య కేసు గురించి తీవ్ర చర్చ జరుగుతోంది. ఇది వైసీపీ నేతలకు కాస్త ఇబ్బందిగా మారింది. కోర్టుల పరిధిలో ఉన్న కేసు గురించి బహిరంగంగా ఎలా ప్రచారం చేస్తారని నిలదీస్తున్నారు. ఎన్నికల వేళ తమను ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే కోర్టును ఆశ్రయించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout