EC:ఈసీ సంచలన నిర్ణయం.. పలు రాష్ట్రాల అధికారులపై వేటు..
- IndiaGlitz, [Monday,March 18 2024]
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే. మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission) సంచలన నిర్ణయం తీసుకుంది. ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, గుజరాత్, ఝార్ఖండ్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులను తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే పశ్చిమ బెంగాల్ రాష్ట్ర డీజీపీని కూడా ఎన్నికల బాధ్యతల నుంచి తప్పించాలని ఆదేశించింది.
వీరితో పాటు బృహన్ముంబయి మున్సిపల్(BMC) కమిషనర్ ఇక్బాల్‌సింగ్ చాహల్, అడినషనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లను సైతం విధుల నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకుంది. మరోవైపు హిమాచల్ ప్రదేశ్, మిజోరం సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శులపై కూడా చర్యలు తీసుకుంటూ ఉత్తర్వులు రిలీజ్ చేసింది. పెద్ద ఎత్తున అధికారులపై చర్యలు తీసుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అధికార పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తు్న్నారనే ఫిర్యాదులతో ఈ చర్యలు తీసుకున్నట్లు ఈసీ వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించాయి.
కాగా దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీలకు శనివారం మధ్యాహ్నం ఈసీ అధికారులు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జూన్ 4న ఒకేసారి ఫలితాలు ప్రకటిస్తామని వెల్లడించారు. ఎన్నికలను నిష్పాక్షపతంగా జరిపిస్తామని.. అన్ని పార్టీలను ఒకేలా చూస్తామని స్పష్టం చేశారు. అలాగే అధికారులు ఎవరైనా విధుల్లో బాధ్యతారహితంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చిన విషయం విధితమే.
ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు తెలంగాణ లోక్‌సభ ఎన్నికలు మే 13న జరగనున్నాయి. ఏప్రిల్ 25 వరకు నామినేషన్లు స్వీకరించనుండగా.. ఏప్రిల్ 26 నామినేషన్ల పరిశీలన.. ఏప్రిల్ 26న ఉపసంహరణకు ఆఖరి తేదీగా ప్రకటించారు. జూన్ 4న కౌంటింగ్ నిర్వహించనున్నారు.