Ruthuraj:చెన్నై సూపర్ కింగ్స్ సంచలన నిర్ణయం.. ధోనీ వారసుడిగా రుతురాజ్..

  • IndiaGlitz, [Thursday,March 21 2024]

ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 17వ సీజన్‌కు రంగం సిద్ధమైంది. రేపు(శుక్రవారం) నుంచి ఐపీఎల్ కొత్త సీజన్ ప్రారంభం కానుంది. చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలి మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఈ సందర్భంగా 10 టీమ్‌ల కెప్టెన్లు అందరూ ఐపీఎల్ ట్రోఫీ ఫొటో షూట్‌లో పాల్గొన్నారు. అయితే అయితే ఈ ఫొటో షూట్‌కు చెన్నై సూపర్ కింగ్స్ తరపున ధోనీ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ నేపథ్యంలోనే చెన్నై కొత్త కెప్టెన్ గైక్వాడ్ అంటూ ఐపీఎల్ నిర్వాహకులు అధికారికంగా తెలిపారు.

మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ కూడా ధోనీ తన కెప్టెన్సీ పగ్గాలను రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించాడని ట్వీట్ చేసింది. దీంతో ఇక నుంచి సీఎస్కే కెప్టెన్‌గా గైక్వాడ్ వ్యవహరించనున్నాడు. ఈ నిర్ణయం పట్ల కొంతమంది సీఎస్కే, ధోనీ అభిమానులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. 'వి మిస్‌ ధోనీ కెప్టెన్సీ' అంటూ పోస్టులు పెడుతున్నారు. సీఎస్కే అంటే ధోనీ, ధోనీ అంటే సీఎస్కే అని గుర్తు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎంఎస్ ధోనీ హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది.

2008 నుంచి 2023 దాకా దాదాపు 14 సంవత్సరాలు సీఎస్కే కెప్టెన్‌గా ధోనీ వ్యవహరించగా 5 సార్లు జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు. అయితే మధ్యలో రెండు సార్లు మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో చెన్నై జట్టును ఐపీఎల్ నుంచి బహిష్కరించారు. ఆ సమయంలో ధోనీ రైజింగ్ పూణే జట్టుకు కెప్టెన్సీ నిర్వహించాడు. ఆ టీమ్‌కు ఆడిన రెండు సీజన్‌లలో ఒక్క సీజన్‌లో ఫైనల్‌కు తీసుకొచ్చాడు. అయితే దురదృష్టవశాత్తూ కప్ కొట్టలేకపోయారు. ధోనీ తన నాయకత్వంలో టీమిండియాతో పాటు చెన్నై జట్టుకు ఎన్నో చిరస్మరణీయమైన విజయాలు అందించిన సంగతి తెలిసిందే.

అయితే వయసు 40 ఏళ్లు దాటడంతో ధోనీ మెల్లగా ఐపీఎల్ నుంచి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ సీజన్‌లో మాత్రమే ఆటగాడిగా ఆడి.. వచ్చే సీజన్‌ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కాగా ఈసారి ఐపీఎల్‌లో తాను కొత్త పాత్రను పోషిస్తున్నానని ఇటీవల ధోనీ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో కెప్టెన్‌గా కాకుండా ఆటగాడిగా కొనసాగుతున్నట్లు చెప్పడమే ఈ పోస్ట్ సారాంశం అని ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు.

ఇదిలా ఉంటే ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో ఈసీజన్‌ నుంచి గోల్డెన్‌ ఎరా ముగిసిందని ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. ముంబయి ఇండియన్స్ ప్రాంచైజీ కూడా కెప్టెన్‌గా రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ పాండ్యాను నియమించిన విషయం విధితమే. అలాగే బెంగళూరు టీం కెప్టెన్‌గా ఇది వరకే విరాట్ కోహ్లీ తప్పుకున్నాడు. దీంతో ముగ్గురు దిగ్గజ ఆటగాళ్లు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నట్లు అయిందని.. ఐపీఎల్‌లో వారి కెప్టెన్సీ ఇక చూడలేమంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ సీజన్‌ నుంచి ఐపీఎల్‌లో వినూత్న మార్పులు జరగనున్నాయని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.