Tamilisai: ఎన్నికల్లో వరుస ఓటములపై తమిళిసై సౌందర్‌రాజన్ సంచలన వ్యాఖ్యలు
Send us your feedback to audioarticles@vaarta.com
గతంలో తాను పోటీ చేసి అన్ని ఎన్నికల్లో ఓడిపోవడంపై తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్(Tamilisai Soundararajan) సంచలన వ్యాఖ్యలు చేశారు. తన వద్ద డబ్బులు లేకపోవడంతోనే ఓడిపోయానని తెలిపారు. చెన్నై సౌత్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న తమిళిసై ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఈసారైనా తనకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ఎన్నికల్లో తాను 5 సార్లు పోటీ చేసినా డబ్బులు లేక ఖర్చు పెట్టలేదన్నారు. ఖర్చు పెట్టేంత డబ్బులు లేకపోవడంతోనే వరుసగా ఎన్నికల్లో ఓడిపోతూ వచ్చానని తెలిపారు.
ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా నెగ్గి ప్రధాని మోదీకి తన సీటు గిఫ్ట్‌గా ఇస్తానని ధీమా వ్యక్తంచేశారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలవబోతున్న 400 సీట్లలో తన సీటు కూడా కచ్చితంగా ఉంటుందన్నారు. దీంతో తమిళిసై వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఇటీవల కేందమంత్రి నిర్మలా సీతారామన్ కూడా డబ్బులు లేని కారణంగానే తాను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని వ్యాఖ్యానించారు. దీంతో నిర్మలా వ్యాఖ్యలు వైరల్ కావడంతో తమిళిసై కూడా ఆమె వ్యాఖ్యలను సమర్థిస్తూ ఈ విధంగా మాట్లాడారు.
తమిళిసై అఫిడవిట్ లెక్కల ప్రకారం ఆమె మీద ఉన్న మొత్తం ఆస్తులు రూ.2.17 కోట్లు ఉన్నాయి. ప్రస్తుతం బ్యాంక్ అకౌంట్లో రూ.50వేల నగదు మాత్రమే ఉంది. ఇక రూ.1.57 కోట్ల విలువ చేసే చరాస్తులు ఉండగా.. ఆమె పేరిట ఒక్క కారు లేదని పేర్కొన్నారు. అయితే ఆమె కుమార్తె పేరు మీద 4 కార్లు ఉన్నాయి. తమిళిసై భర్త పేరిట రూ.3.92 కోట్ల మాత్రం విలువైన చరాస్తులు ఉన్నాయని వెల్లడించారు.
కాగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని భావించిన తమిళిసై తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తమిళనాట బీజేపీ బలోపేతంలో ఆమె పాత్ర కీలకమైంది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షురాలిగా, జాతీయ కార్యదర్శిగా పలు పదవులను నిర్వహించారు. 2006 ఎన్నికల్లో రామనాథపురం నియోజవర్గం నుంచి తొలిసారి పోటీ చేయగా ఓటమి ఎదురైంది. 2009 లోక్‌సభ ఎన్నికల్లో చెన్నై ఉత్తర నియోజకవర్గం నుంచి బరిలో నిలిచి ఓడిపోయారు. అనంతరం 2011 ఎన్నికల్లో శాసనసభ్యురాలిగా పోటీచేసి ఓడిపోయారు. అలాగే 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమి నేతృత్వంలో తూత్తుకుడి నుంచి పోటీ చేసినా ఓటమే ఎదురయ్యింది. అయితే పార్టీలో ఆమె సేవలను గుర్తించిన బీజేపీ అధినాయకత్వం తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా నియమించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments