KCR, Revanth Reddy:కామారెడ్డిలో సంచలనం.. కేసీఆర్, రేవంత్ రెడ్డి ఓటమి..
- IndiaGlitz, [Sunday,December 03 2023]
కామారెడ్డి నియోజకవర్గంలో సంచలనం నమోదైంది. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సీఎం కేసీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిలపై బీజేపీ అభ్యర్థి వెంటక నారాయణ రెడ్డి ఘన విజయం సాధించారు. 6వేల ఓట్లతో గెలిచిన ఆయన చరిత్ర సృష్టించారు. హేమాహేమీ నాయకలైన కేసీఆర్, రేవంత్ రెడ్డిని కాదని ఓటర్లు కాషాయం అభ్యర్థికి ఓట్లు వేయడం చర్చనీయాంశమైంది. కేసీఆర్, రేవంత్ ఇద్దరు తమ సొంత నియోజకవర్గాలతో పాటు ఇక్కడ కూడా పోటీ చేశారు. అయితే వెంకటనారాయణ రెడ్డి స్థానికుడు కావడంతో ఓటర్లు ఆయన వైపు మొగ్గుచూపారు.
కౌంటింగ్ మొదలైన దగ్గరి నుంచి కేసీఆర్ వెనుకంజలోనే కొనసాగుతున్నారు. ఇక రేవంత్ రెడ్డి మాత్రం 13 రౌండ్ల వరకు ఆధిక్యంలో కొనసాగారు. 14వ రౌండ్ నుంచి బీజేపీ అభ్యర్థి ముందంజలోకి వచ్చారు. అప్పటి నుంచి ఆయనే ఆధిక్యం కొనసాగిస్తూ చివరకు 6వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇక రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి గెలుపొందగా.. కేసీఆర్ గజ్వేల్ నుంచి విజయం సాధించారు. వీరిద్దరిలో ఎవరు గెలిచినా ఇక్కడ ఉప ఎన్నికల వచ్చేది. కానీ కమలం పార్టీ గెలవడంతో బై ఎలక్షన్‌కు అవకాశం లేకుండా పోయింది. ఈ విజయంతో కలిపి బీజేపీ అభ్యర్థులు మొత్తం 8 స్థానాల్లో గెలుపొందారు. గతంలో కంటే 7 స్థానాలు గెలిచి ఓటు బ్యాంక్ పెంచుకున్నారు.
అయితే బీజేపీ ముఖ్య నేతలైన బండి సంజయ్ కరీంనగర్ నుంచి, ధర్మపురి అరవింద్ కోరుట్ల నుంచి, సోయం బాపూరావు బోథ్ నుంచి, రఘునందన్ రావు దుబ్బాక నుంచి, ఈటల రాజేందర్ హుజురాబాద్, గజ్వేల్ నియోజకవర్గాల నుంచి ఓడిపోవడం కాషాయం కార్యకర్తల్లో నిరుత్సాహం నింపింది.