వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న ఈటల.. రోజుకో నేతతో భేటీ
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా సమయాన్ని మాజీ మంత్రి ఈటల రాజేందర్ చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారు. ఆయన ఏం చేయబోతున్నారనేది బయటకు రావడం లేదు కానీ మొత్తానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారనేది మాత్రం తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈటల రోజుకు ఒకరిద్దరు ప్రముఖ నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ బిజీబిజీగా గడిపేస్తున్నారు. ఇప్పటికే బండి సంజయ్, డీకే అరుణ, రేవంత్, భట్టిని ఈటల కలిశారు. నేడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ డి.శ్రీనివాస్‌తో పాటు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌తో సమావేశం నిర్వహించారు.
డి.శ్రీనివాస్‌తో ఈటల గంటన్నరకు పైగా చర్చలు జరిపారు. డీఎస్ ఇంటికి వెళ్లి మరీ ఈటల ఆయనను కలిశారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో పాటు భవిష్యత్తు రాజకీయాలపై డీఎస్‌తో ఈటల చర్చించినట్టు తెలుస్తోంది. త్వరలో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని ఈటల వెల్లడించారు. తన పోరాటానికి మద్దతు ఇవ్వాలని నేతలను కలిసి కోరుతున్నానని ఈటల రాజేందర్ తెలిపారు. కాగా.. డీఎస్‌తో జరిపిన సమావేశంలో ఈటలతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నేత బయ్యపు సమ్మిరెడ్డి సైతం పాల్గొన్నారు.
డి.శ్రీనివాస్‌ను కలిసిన అనంతరం ఈటల బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌ను సైతం కలిశారు. అరవింద్‌తో సైతం ఈటల తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనట్లు తెలుస్తోంది. అయితే వీరిద్దరి భేటీ ఆసక్తికరంగా మారింది. కాగా.. మంగళవారం సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో ఈటల భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని భట్టి నివాసానికి వెళ్లిన ఈటల రాజేందర్ ఆయన్ను కలిశారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై భట్టి విక్రమార్కతో ఈటల చర్చించినట్లు సమాచారం. ఒక్క టీఆర్ఎస్ మినహా ఇతర పార్టీల ప్రముఖ నేతలందరినీ ఈటల స్వయంగా కలుస్తున్నారు.
తనపై భూ కబ్జా నిందలు వేసి మంత్రివర్గం నుంచి తొలగించారంటూ తనకు జరిగిన అన్యాయంపై తాను నిర్వహించబోయే పోరాటానికి మద్దతు తెలపాలని నేతలందరినీ ఈటల కోరుతున్నట్టు తెలుస్తోంది. తనపై భూకబ్జా ఆరోపణలు వచ్చిన అనంతరం తాను అన్ని పార్టీల నేతలను కలుస్తున్నానని ఈటల చెబుతున్నట్టు తెలుస్తోంది. ఈటలపై ఆరోపణలు వచ్చినప్పటి నుంచి ఆయనకు ప్రజల నుంచి విపరీతమైన మద్దతు లభిస్తోంది. అలాగే విపక్షాలు సైతం ఆయనకు మద్దతుగా మాట్లాడుతున్నాయి. ఈ క్రమంలోనే ఆయన నిర్వహిస్తున్న భేటీలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments