సీనియర్‌ జర్నలిస్ట్‌, మ్యూజికాలజిస్ట్ రాజా ఇక లేరు

  • IndiaGlitz, [Thursday,April 15 2021]

‘హాసం’ రాజాగా సుపరిచితులైన సీనియర్‌ జర్నలిస్ట్‌, మ్యూజికాలజిస్ట్ రాజా(70) ఇక లేరు. గురువారం ఆయన హైదరాబాద్‌లో కన్ను మూశారు. రాజా అసలు పేరు మంగు నరసింహ స్వామి. బీకామ్‌ చదివిన రాజా.. 1974లో ‘వెండితెర’ సినీ వారపత్రికలో జర్నలిస్టుగా తన కెరీర్‌‌ను ప్రారంభించారు. ఆ తర్వాత ‘సినీ హెరాల్డ్‌’ వార పత్రికలో చేరారు. ఈ పత్రిక ద్వారా ఎందరో సినీ ప్రముఖులను ఇంటర్వ్యూ చేశారు. అలాగే ‘సినీ స్వరాలు’ పేరుతో ఆయన నిర్వహించిన శీర్షిక సినీ సంగీత ప్రపంచానికి దగ్గర చేసింది. అలాగే ‘సితార’ సినీ వారపత్రికలో రాజా నిర్వహించిన ‘సితారాగాలు’, ‘కూనిరాగాలు’ శీర్షికలు ఆయనకు ఎంతో పేరు తెచ్చాయి.

‘పల్లకి’ అనే వారపత్రికలో పని చేస్తున్న సమయంలోనే రాజా రాసిన ‘మల్లాది వెంకట కృష్ణమూర్తి’ సీరియల్‌ తెలుగు సాహిత్యంలో ఓ కొత్త ప్రయోగంగా గుర్తింపు తెచ్చుకొంది. ‘పల్లకి’ తర్వాత ‘ఆంధ్రభూమి’, ‘సితార’, ‘జ్యోతిచిత్ర’ సినిమా పత్రికల్లో ‘ఈ పాట ఇలా పుట్టింది’ అనే శీర్షికను రాజా నిర్వహించారు. అలాగే ఓ దినపత్రికలో ‘ఆ పాత మధురం’ పేరుతో ఆయన నిర్వహించిన శీర్షిక ఎంతో పేరు తెచ్చింది. అలాగే ‘హాసం’ హాస్య సంగీత పక్ష పత్రికకు ఎడిటర్‌గా చాలా కాలం పనిచేయడంతో ఆయన ‘హాసం’ రాజాగా పేరు గడించారు. మ్యూజికాలజిస్టుగా సినిమా పాటలను విశ్లేషించడంలో రాజా తన ప్రత్యేకతను చూపేవారు. అంతేకాకుండా ఆ పాటల తమిళ, హిందీ, కన్నడ, బెంగాలీ, ఆంగ్ల పాటల మూలాలను వెలికితీసి ఆ వివరాలను పాఠకులకు అందించేవారు.

‘హాసం’ పత్రిక మూసేసిన అనంతరం ‘మా టీవీ’లో రాజా పదేళ్లపాటు పనిచేశారు. అక్కడ సినీ ప్రముఖులతో చేసిన ‘గుర్తుకొస్తున్నాయి’ అనే కార్యక్రమం ఆయనకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. సినీ సంగీతానికి తను చేసిన పరిశోధనలకుగానూ గౌరవ డాక్టరేట్‌‌ను రాజా పొందారు. తెలుగు సినిమా పాటలు, వాటి రాగాలపై ‘ఆ పాత మధురం’ అనే పుస్తకాన్ని కూడా రాశారు. తెలుగు సినిమా పాటకు సంబంధించి సినీ ప్రముఖుల్లో ఎవరికి ఎలాంటి సందేహం కలిగినా వెంటనే రాజాను సంప్రదించేవారు. తెలుగు సినిమా పాటలకు సంబంధించిన పూర్తి వివరాలు అందరికీ అందుబాటులో ఉండాలనే ఆలోచనతో ‘రాజా మ్యూజిక్‌ బ్యాంక్‌’ ఏర్పాటు చేసి, దాదాపు 40 వేల పాటలు సేకరించారు. రాజా మృతి పట్ల సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.