జగన్ సంచలన నిర్ణయం.. ఐపీఎస్ ఆఫీసర్ సస్పెండ్!
- IndiaGlitz, [Sunday,February 09 2020]
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అనుకూలంగా అప్పట్లో వ్యవహరించిన ఉన్నతాధికారులకు జగన్ వరుస షాకిలిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేసిన 1989 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తున్నట్లు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే ఆయన్ను ఎందుకు సస్పెండ్ చేస్తున్నామనే విషయంపై ప్రభుత్వం నిశితంగా వివరణ కూడా ఇచ్చింది. విధినిర్వహణలో ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు ఆధారాలు లభ్యమయ్యాయని అందుకే ఆయన్ను సస్పెండ్ చేస్తున్నామని ప్రకటించింది.
అసలేం జరిగింది!
కాగా.. ఆయనపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించామని, అవినీతిపై ఆధారాలు లభ్యమైనందునే సస్పెండ్ చేశామని ప్రభుత్వం జారీ చేసిన జీవోలో చీఫ్ సెక్రెటరీ నీలం స్వాహ్నీ నిశితంగా వివరించారు. భద్రతా పరికరాల కొనుగోలులో ఉద్దేశపూర్వకంగా ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించి వ్యవహరించారని ఆరోపిస్తూ ఆయనపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇదిలా ఉంటే.. జగన్ సీఎం అయ్యాక ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేసిన ప్రభుత్వం, కొన్నాళ్లు పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్‌లో పెట్టిన విషయం విదితమే.
ఏబీ స్పందన ఇదీ..!
సస్పెన్షన్ అనంతరం మీడియాతో మాట్లాడిన ఏబీ.. అక్రమాల కారణంగానే తనపై చర్యలు తీసుకున్నారని మీడియాలో వస్తున్న కథనాల్లో వాస్తవం లేదన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో మానసికంగా తనకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు ఆందోళన చెందవద్దని ఈ సందర్భంగా ఏబీ మీడియా వేదికగా కోరారు. ప్రభుత్వం తదుపరి చర్య ఏమిటన్నది త్వరలో తెలుస్తుందన్నారు. అంతటితో ఆగని ఆయన.. ప్రభుత్వ నిర్ణయంపై తాను చట్టపరంగా ముందుకు వెళ్తానని స్పష్టం చేశారు. అయితే ఈ వ్యవహారం ఎంతవరకూ దారి తీస్తుందో.. కోర్టులు దీనిపై ఎలా రియాక్ట్ అవుతాయో వేచి చూడాల్సిందే మరి.