కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ ఇక లేరు..
- IndiaGlitz, [Wednesday,November 25 2020]
కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్(71) కరోనాకు చికిత్స పొందుతూ కన్నుమూశారు. గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో గత కొద్ది రోజులుగా కరోనాకు చికిత్స పొందుతున్న ఆయన బుధవారం ఉదయం 3.30 గంటలకు అహ్మద్ పటేల్ తుదిశ్వాస విడిచారని ఆయన కుమారుడు ఫైసల్ పటేల్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. అహ్మద్ పటేల్‌కు నెల రోజులు క్రితం కరోనా వైరస్ సోకింది. గత కొద్దిరోజులుగా ఆయన శరీరంలోని పలు అవయవాలు సవ్యంగా పనిచేయకపోవడంతో ఆరోగ్యం మరింతగా క్షీణించిందని.. అప్పటి నుంచి ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
అహ్మద్ పటేల్ గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితులు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి ఆయన సలహాదారుగా వ్యవహరించారు. ఎనిమిది సార్లు పార్లమెంట్ సభ్యుడిగానూ.. మూడు సార్లు లోక్‌సభ, ఐదు సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో కీలక వ్యూహకర్తగా వ్యవహరించడమే కాకుండా.. పార్టీలోని అంతర్గత విభేదాలను సైతం అత్యంత నైపుణ్యంతో పరిష్కరించేవారు. కాంగ్రెస్ పార్టీకి అహ్మద్ పటేల్ లేని లోటును ఎవరూ తీర్చలేనిదనే చెప్పాలి. అహ్మద్ పటేల్ మృతిపై ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంకలు కన్నీటి పర్యంతమయ్యారు.