Radhika:మంత్రి రోజాకు అండగా ఉంటా.. బండారు వ్యాఖ్యలపై మండిపడిన సీనియర్ నటి రాధిక
Send us your feedback to audioarticles@vaarta.com
మంత్రి రోజాపై టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై తమిళ సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటీమణులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇప్పటికే సీనియర్ నటి, బీజేపీ నాయకురాలు ఖుష్భూ బండారు వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా.. తాజాగా మరో సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ కూడా దీనిపై స్పందించారు. ఓ స్నేహితురాలిగా, సహనటిగా, ఎంతో ధైర్యవంతురాలైన మహిళగా రోజా గురించి తెలిసిన వ్యక్తిగా తాను మద్దతు ప్రకటిస్తున్నానని తెలిపారు. కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలు, చవకబారు రాజకీయాలు తనను ఎంతగానో బాధించాయన్నారు. దిగజారుడు, చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. మహిళలకు 33శాతం రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంట్లో ఆమోదం లభించిన ఈ తరుణంలో ఓ బాధ్యతా గల పదవిలో ఉన్న మహిళపై ఇలాంటి నీచపు వ్యాఖ్యలు తనకు ఆగ్రహం కలిగించాయని ఆమె పేర్కొన్నారు.
టీడీపీ నేతలు మహిళలను ఇలాగేనా గౌరవించేది..?
దేశం పురోగతి దిశగా ముందుకు సాగుతుందని.. దేశాభివృద్ధిలో మహిళా నాయకులు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారని గుర్తుచేశారు. ఓ గౌరవనీయ రాజకీయ నాయకుడి నుంచి, ఇలాంటి కామెంట్లు రావడం చాలా బాధాకరమన్నారు. మన దేశాన్ని భారత్ మాతగా పిలుచుకుంటామని అంటే మహిళలకు అంతటి గౌరవం ఇచ్చే దేశంలో మహిళలను ఇలాగేనా గౌరవించేది అంటూ మండిపడ్డారు. దారుణంగా మాట్లాడితే మహిళలు భయపడతారనుకుంటే అది చాలా తప్పన్నారు.
మీ ఇంట్లో ఏం జరుగుతుందో మీకు తెలుసా..?
ఇలాంటి మాటలతో ఒకరిని హింసించడం వల్ల మీకు ఒరిగిందేమిటి? సమాజంలో మీకు గౌరవం పెరిగిందా? సిగ్గేస్తోంది మిమ్మల్ని చూసి. ఎంతో మంది గొప్ప వ్యక్తులు ఉన్న మీ పార్టీని కూడా మీరు అగౌరవపరిచారన్నారు. మీరు ఉదయం నిద్రలేచాక రాజకీయాల కోసం బయటకు వెళ్తున్నప్పుడు మీ ఇంట్లో ఏం జరుగుతోందో మీకు తెలుసా? అని ప్రశ్నించారు. మీలా తాము తిరిగి మాట్లాడడానికి ఎంతో సమయం పట్టదన్నారు. రోజాకు తాను అండగా ఉంటానని రాధిక స్పష్టం చేశారు. తక్షణమే రోజాకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments