Jayasudha:ఎలక్షన్ టైం బాసూ : త్వరలో బీజేపీలోకి సహజనటి జయసుధ, పోటీ అక్కడి నుంచే..?
- IndiaGlitz, [Sunday,July 30 2023]
భారతదేశంలో సినీ తారలకు రాజకీయాలకు విడదీయరాని అనుబంధం వుంది. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి నేటి వరకు ఎందరో తారలు ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి పాల్గొనగా.. కొందరు మాత్రం బయటి నుంచి మద్ధతు ఇచ్చారు. అయితే ఎన్నికల్లో పోటీ చేసి సక్సెస్ అయిన వారు కొందరే. ఇలాంటి వాతావరణం ఉత్తరాదితో పోలిస్తే.. దక్షిణాదిలో కాస్త ఎక్కువగా కనిపిస్తుంది. ఎన్టీఆర్, ఎమ్జీయార్, జయలలిత వంటి వెండితెర వేల్పులు ముఖ్యమంత్రులై చరిత్ర సృష్టించారు. వారి స్పూర్తితో ఎందరో రాజకీయాల్లోకి ప్రవేశించి తమ అదృష్టం పరీక్షించుకున్నారు. మరో ఏడాదిలో భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అంతకుమందే పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలకు చెందిన సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి అడుగుపెట్టే అవకాశం వుంది.
కాంగ్రెస్, టీడీపీ, వైసీపీలలో పనిచేసిన జయసుధ :
ఇకపోతే.. తెలుగులో సహజనటిగా గుర్తింపు తెచ్చుకున్న జయసుధ కూడా రాజకీయాల్లో సత్తా చాటారు. 2009లో కాంగ్రెస్‌లో చేరిన ఆమె సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014 వరకు కాంగ్రెస్‌లోనే వున్న ఆమె రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. అక్కడా కొన్నాళ్లు వున్న జయసుధ 2019లో వైసీపీలో చేరి ప్రస్తుతం అందులోనే కొనసాగుతున్నారు. అయితే గత కొంతకాలంగా వ్యక్తిగత సమస్యలతో సినిమాలకు , రాజకీయాలకు దూరంగా వున్న సహజనటి.. ప్రస్తుతం రాష్ట్రంలో, దేశంలో ఎన్నికల సీజన్ కావడంతో మరోసారి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
బీజేపీలో చేరాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు :
బీజేపీలో చేరాలని ఎప్పటి నుంచో భావిస్తున్న జయసుధ తన ప్రయత్నాలను ప్రారంభించారు. తనకున్న పరిచయాలతో లాబీయింగ్ చేస్తున్న ఆమె తాజాగా శనివారం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ క్రమంలో ఆమె చేరికపై సానుకూల స్పందన వచ్చినట్లుగా తెలుస్తోంది. త్వరలో అమిత్ షా సమక్షంలో జయసుధ బీజేపీలో చేరుతారని సమాచారం. సికింద్రాబాద్ లేదా ముషీరాబాద్ నుంచి సహజనటి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.