Venu Father: సీనియర్ నటుడు వేణు ఇంట్లో విషాదం.. ఆయన తండ్రి కన్నుమూత

  • IndiaGlitz, [Monday,January 29 2024]

సీనియర్ నటుడు వేణు తొట్టెంపూడి(Venu Thottempudi) కుటుంబలో విషాదం నెలకొంది. ఆయన తండ్రి ప్రొఫెసర్ తొట్టెంపూడి వెంకటసుబ్బారావు ఇవాళ ఉదయం కన్నుమూశారు. ప్రస్తుతం ఆయనకు 92 సంవత్సరాలు. వయోభారం నేపథ్యంలో అనారోగ్య సమస్యలతో తుదిశ్వాస విడిచారు. పలువురు సినీ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. వెంకట సుబ్బారావు భౌతికకాయాన్ని ప్రముఖుల సందర్శనార్ధం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ, స్టీల్ & మైన్స్ కాంప్లెక్స్ వద్ద ఉంచారు. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

ప్రకాశం జిల్లాకు చెందిన వేణు ‘స్వయంవరం’ సినిమాతో టాలీవుడ్‌లో హీరోగా అడుగుపెట్టారు. తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకుని హీరోగా గ్రాండ్‌గా అడుగుపెట్టారు. ఆ తర్వాత చిరునవ్వుతో, పెళ్లాం ఊరెళితే, హనుమాన్ జంక్షన్, కల్యాణరాముడు, చెప్పవే చిరుగాలి, శ్రీకృష్ణ 2006, అల్లరే అల్లరి, గోపి గోపిక గోదావరి వంటి హిట్ సినిమాల్లో నటించి ప్రత్యేక స్థానం దక్కించుకున్నాడు.

తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన 'దమ్ము' సినిమాలో ఓ కీలక పాత్ర పోషించారు. అయితే ఆ సినిమా కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో మళ్లీ మూవీలకు దూరం అయ్యాడు. ఇక ఇటీవల రవితేజ నటించిన 'రామారావు ఆన్ డ్యూటీ' చిత్రం ద్వారా మళ్లీ ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా ఓటీటీలో 'అతిథి' అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.