Sarath Babu : శరత్ బాబు మరణించారంటూ కథనాలు .. క్లారిటీ ఇచ్చిన సోదరి
- IndiaGlitz, [Thursday,May 04 2023]
సోషల్ మీడియా రాకతో ప్రతి వార్తా క్షణాల్లో వైరల్ అయిపోతోంది. ఇదే సమయంలో ఏది నిజమో, ఏది అబద్ధమో చెప్పలేని పరిస్ధితి. ఎవరైనా సెలబ్రెటీ ఆరోగ్యం బాగోక ఆసుపత్రిలో జాయిన్ అయితే చాలు వారు చనిపోయారంటూ సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వైరల్ అవుతోంది. దీంతో ఫలానా ప్రముఖులు తామే బతికే వున్నామని .. తప్పుడు వార్తలు నమ్మొద్దంటూ స్వయంగా వివరణ ఇచ్చుకోవాల్సి వస్తోంది. కొద్దిరోజుల క్రితం సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావుకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. కోటా మరణించారంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వార్త క్షణాల్లో వైరల్ అయ్యింది. అసలే కే. విశ్వనాథ్, జమున, తారకరత్నల మరణాలతో తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయిన చిత్ర పరిశ్రమ ఈ వార్తతో ఉలిక్కిపడింది. దీంతో కోటానే స్వయంగా వీడియో రిలీజ్ చేసి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. డబ్బు కోసం ఇలాంటి పనులు చేయొద్దని కోటా విజ్ఞప్తి చేశారు.
శరత్ బాబు మరణించారంటూ వార్తలు :
తాజాగా మరో సీనియర్ నటుడు శరత్ బాబు తుదిశ్వాస విడిచారంటూ బుధవారం సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయితే వీటిపై శరత్ బాబు సోదరి సరిత స్పందించారు. శరత్ బాబు చనిపోయినట్లుగా వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. ఆయన కొంచెం కోలుకోవడంతో మరోరూమ్‌కి షిఫ్ట్ చేసినట్లు సరిత తెలిపారు. త్వరలోనే శరత్ బాబు పూర్తిగా కోలుకొని మీడియాతో మాట్లాడతారని ఆమె చెప్పారు. సోషల్ మీడియాలో శరత్ బాబు గురించి వస్తున్న వార్తలను నమ్మొద్దని సరిత కోరారు.
ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శరత్ బాబు :
కాగా.. కొద్దిరోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో శరత్ బాబు బెంగళూరులో చికిత్స తీసుకున్నారు. ఆరోగ్యం నిలకడగా వుందని భావించినా.. మరోసారి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆయనను హైదరాబాద్ ఏఐజీకి తరలించారు. నాటి నుంచి ఆయనను ఐసీయూలో వుంచి చికిత్స అందిస్తున్నారు. అయితే శరరీం మొత్తం ఇన్‌ఫెక్షన్ వ్యాపించడంతో ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీలు వంటి కీలక అవయవాలు పాడైపోయినట్లుగా ఏఐజీ వైద్యులు ఇటీవల హెల్త్ బులెటిన్‌లో వెల్లడించారు. దీంతో ఆయనకు వెంటిలేటర్‌పైనే చికిత్స అందించారు. అయితే ప్రస్తుతం శరత్ బాబు కోలుకుంటున్నట్లుగా ఆయన సోదరి సరిత తెలిపారు.