Sarath Babu: టాలీవుడ్‌లో మరో విషాదం .. సీనియర్ నటుడు శరత్ బాబు కన్నుమూత
Send us your feedback to audioarticles@vaarta.com
సంగీత దర్శకుడు రాజ్ మరణం నుంచి కోలుకోకముందే తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు శరత్ బాబు ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కొద్దిరోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆయన బెంగళూరులో చికిత్స తీసుకున్నారు. ఆరోగ్యం నిలకడగా వుందని భావించినా.. శరత్ బాబు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో హైదరాబాద్ ఏఐజీకి తరలించారు. నాటి నుంచి ఆయనను ఐసీయూలో వుంచి చికిత్స అందించారు. అయితే శరీరం మొత్తం ఇన్‌ఫెక్షన్ వ్యాపించడంతో ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీలు వంటి కీలక అవయవాలు పాడైపోయినట్లుగా ఏఐజీ వైద్యులు ఇటీవల హెల్త్ బులెటిన్‌లో వెల్లడించారు. దీంతో ఆయనకు వెంటిలేటర్‌పైనే చికిత్స అందించారు. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం శరత్ బాబు ఆరోగ్యం క్షీణించడంతో చనిపోయినట్లుగా కథనాలు వచ్చాయి. దీంతో కుటుంబ సభ్యులు స్పందించి వాటిని కొట్టిపారేశారు. ఆరోగ్యం మెరుగుపడుతోందని.. త్వరలోనే ఆయన కోలుకుంటారని తెలిపారు. ఈ క్రమంలో సోమవారం శరత్ బాబు ఆరోగ్యం మరింత విషమించి తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో టాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. పలువురు సినీ ప్రముఖులు ఆయనకు సంతాపం ప్రకటిస్తున్నారు.
అప్పట్లో అమ్మాయిల కలల రాకుమారుడిగా శరత్ బాబు :
1951 జూలై 31న శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో జన్మించిన శరత్ బాబు అసలు పేరు.. సత్యం బాబు దీక్షితులు. 1973లో రామరాజ్యం సినిమా ద్వారా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన శరత్ బాబు .. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 200కు సినిమాలు చేశారు. 1970-80 దశకాలలో శరత్ బాబు స్టార్‌గా వెలుగొందారు. వైట్ స్కిన్ టోన్‌తో అమ్మాయిల కలల రాకుమారుడిగా అప్పట్లో ఆయన నిలిచారు. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్నారు. మూడుముళ్ల బంధం, సీతాకోక చిలుక, సంసారం ఒక చదరంగం, అన్నయ్య, ఆపద్భాందవుడు, సాగర సంగమం, బొబ్బిలి సింహం , శివరామరాజు ఇలా ఆయన కెరీర్‌లో ఎన్నో మరుపురాని చిత్రాలు వున్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమ మద్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చేసినప్పటికీ ఆయన చెన్నైలోనే తన శేష జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతున్నారు.
రమాప్రభతో ఎక్కువ రోజులు సాగని బంధం :
శరత్ బాబు సీనియర్ నటి రమాప్రభను పెళ్లాడిన సంగతి తెలిసిందే. అయితే కాపురంలో మనస్పర్థల కారణంగా ఈ జంట ఎక్కువ రోజులు కలిసి లేరు. ఆ తర్వాత స్నేహ నంబియార్ అనే నటిని శరత్ బాబు పెళ్లాడారు. అంతేకాకుండా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన పలు సీరియల్స్‌లోనూ ఆయన నటించారు. తన కెరీర్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మూడు సార్లు నంది అవార్డులు అందుకున్నారు శరత్ బాబు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments