సీనియర్ నటుడు ‘రాళ్లపల్లి’ కన్నుమూత

  • IndiaGlitz, [Friday,May 17 2019]

టాలీవుడ్ సీనియర్ నటుడు రాళ్ళపల్లి నరసింహారావు(73) తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రాళ్లపల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మ్యాక్స్ క్యూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు. రాళ్లపల్లి ఇకలేరని తెలుసుకున్న నటీనటులు సంతాపం తెలిపారు. టాలీవుడ్‌లో వరుస విషాదఛాయలు అలుముకున్నాయి.

రాళ్ళపల్లి తూర్పు గోదావరి జిల్లా, రాచపల్లి లో 1955, అక్టోబర్ 10 న జన్మించారు. రాళ్ళపల్లి నరసింహారావు ప్రముఖ తెలుగు సినిమా, రంగస్థల నటులుగా రాణించారు. నటనను వృత్తిగా, ప్రవృత్తిగా కాకుండా నటనే ప్రాణంగా ప్రేమించేవాళ్లలో అరుదైన నటుడే రాళ్లపల్లి. చిన్నతనం నుంచే నాటకాలు వేస్తూ వస్తున్న రాళ్లపల్లి ఇప్పటి వరకూ ఎనిమిది వేలకు పైగా నాటకాల్లో నటించాడు. 800కిపైగా సినిమాల్లో రాళ్లపల్లి నటించి మెప్పించారు. కాగా.. నాటకాల్లో చాలా భాగం తను స్వయంగా రాసి డైరెక్ట్ చేసినవే కావడం విశేషం. జ్యోతిష్కుడు, హిజ్రా, యానాది, పోలీస్‌, నావికుడు... ఇలా ఏ పాత్రనైనా సరే అవలీలగా పోషించగలిగిన సహజ నటుడు రాళ్లపల్లి. నటనలో ఆయనకంటూ ఒక సొంత శైలి ఉంది.. మూడు దశాబ్దాలలో ఆరు వందల చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషించారు.

కాగా.. ఈయనకి బాగా పేరు తెచ్చిన నాటకం ‘కన్యాశుల్కం’. చదువుకునే రోజుల్లో కళాశాలలో జరిగిన పోటీల కోసం ‘మారని సంసారం’ అనే నాటిక రాశాడు. రచన, నటన రెండింటికీ అవార్డులు వచ్చాయి. ప్రముఖ నటి భానుమతి గారి చేతుల మీదుగా ఆ అవార్డులు అందుకున్నాడు. 1973లో ‘స్త్రీ’ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. ‘ఊరుమ్మడి బతుకులు’ సినిమాతో కెరీర్‌కు బ్రేక్‌తో పాటు ‘నంది పురస్కారం’ కూడా ఆయన సొంతమైంది. ఆ తర్వాత చిల్లరదేవుళ్లు, చలిచీమలు సినిమాలు రాళ్లపల్లికి తిరుగులేని గుర్తింపును తెచ్చాయి.

రాళ్లపల్లికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఒకరు మృతి చెందగా.. మరొకరు అమెరికాలో ఉన్నారు. ఆమె అమెరికా నుంచి వచ్చిన తర్వాతే అంత్యక్రియలు ఉంటాయని తెలుస్తోంది.