Nazar : ఆరోజు చిరంజీవి సలహా జీవితాన్ని మలుపు తిప్పింది : నాజర్
- IndiaGlitz, [Tuesday,May 31 2022]
నాజర్.. ఈ పేరు తెలియని తెలుగు వారుండరు. తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాదిలో ఆయన ఎంతో పాపులర్. ఈ తరం వారికి ‘బాహుబలి’లో బిజ్జలదేవునిగా బాగా గుర్తు. తమిళనాట పుట్టినా, తనదైన అభినయంతో తెలుగువారిని అలరిస్తున్నారు నాజర్. నటన, దర్శకత్వం, నిర్మాణం, గానం, గాత్రదానం, రాజకీయం అన్నింట్లో అడుగుపెట్టిన నాజర్ తన బహుముఖ ప్రజ్ఞనూ చాటుకున్నారు. ఇటీవల indiaglitzతో ముచ్చటించిన ఆయన తన జీవితంలోని పలు సంఘటనలను పంచుకున్నారు.
చిరంజీవి, సుధాకర్ నా క్లాస్‌మేట్స్:
కొన్నాళ్ళు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేసిన నాజర్ ‘సౌత్ ఇండియన్ ఫిలిమ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్’ నిర్వహించిన ఫిలిమ్ ఇన్‌స్టిట్యూట్ లోనూ, ఆ పైన ‘తమిళనాడు ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఫిలిమ్ అండ్ టెలివిజన్ టెక్నాలజీ’లోనూ నటనలో శిక్షణ తీసుకున్నారు. ‘సౌత్ ఇండియన్ ఫిలిమ్ ఛాంబర్’ నిర్వహించిన ఫిలిమ్ ఇన్‌స్టిట్యూట్ లో నటశిక్షణ తీసుకుంటున్న సమయంలో మెగాస్టార్ చిరంజీవి, సుధాకర్ వంటివారు నాజర్‌కు క్లాస్ మేట్స్.
చిరంజీవి సలహాతోనే సినిమాల వేట:
ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న తరువాత నాజర్ సినిమాల కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో పొట్ట కూటి కోసం చెన్నైలోని ఓ హోటల్‌లో పనిచేశారు. అక్కడే ఓసారి చిరంజీవి, నాజర్‌ను చూసి “ఎంతో టాలెంట్ ఉన్నవాడివి… ఈ హోటల్‌లో ఉద్యోగమేంటి… మళ్ళీ ట్రై చేయి… ఈసారి అవకాశం వచ్చి తీరుతుంది… లేదంటే నేనే ఇప్పిస్తా…” అని నాజర్‌లో ధైర్యం నూరిపోశారు. దాంతో ఆయన ఆ ఉద్యోగం మానేసి, మళ్ళీ సినిమాల వేటలో పడ్డారు. ఆ సమయంలో ప్రసిద్ధ దర్శకుడు కె.బాలచందర్, నాజర్‌కు తన ‘కళ్యాణ అగతిగల్’లో కన్నయ్ రామ్ అనే పాత్రను ఇచ్చారు. ఈ చిత్రంలో వై.విజయ భర్తగా నాజర్ నటించారు. చిరంజీవి ఇచ్చిన సలహాతోనే నాజర్ ఉత్సాహంగా చిత్రసీమలో ధైర్యంగా అడుగువేశారు. అయితే ఇన్నేళ్ల ఫ్రెండ్‌షిప్‌లొ చిరంజీవితో కలసి నాజర్ నటించడం కుదరలేదు. అయితే చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో చేసిన 150వ చిత్రం ‘ఖైదీ నంబర్ 150’లోనూ, తరువాత వచ్చిన ‘సైరా..నరసింహారెడ్డి’లోనూ ఈ ఇద్దరు మిత్రులు కలసి నటించారు.
ఏంట్రా ఇది.. నిన్ను చంపేస్తా:
అలాగే తాను మద్రాస్‌కు 60 కిలోమీటర్ల దూరంలో వున్న చెంగల్పట్టు అనే చిన్న గ్రామం నుంచి రోజూ రైలులో వచ్చేవాడినని నాజర్ చెప్పారు. ఉదయం 6 గంటలకల్లా రైలు బయల్దేరేదని.. ఆ సమయంలో మధ్యాహ్నం భోజనం కోసం ఒట్టి అన్నం మాత్రమే బాక్స్‌లో పెట్టుకుని వచ్చేవాడినని ఆయన గుర్తుచేసుకున్నారు. అందరూ కలిసి భోజనం చేస్తుండగా తాను ఒట్టి అన్నం మాత్రమే తెచ్చుకోవడం చూసిన చిరంజీవి.. తనను చంపేస్తానని హెచ్చరించారని ఆయన తెలిపారు. భోజనం కోసం మా అమ్మగారిని ఇబ్బంది పెట్టొద్దని చెప్పిన ఆయన.. ఇకపై ప్రతిరోజూ మాతో కలిసి తినాలని చెప్పినట్లు నాజర్ గుర్తుచేసుకున్నారు. అప్పటికీ ఇప్పటికీ చిరంజీవితో ఆ బంధం కొనసాగుతూనే వుందని పేర్కొన్నారు.