ఆస్పత్రిలో చేరిన కృష్ణంరాజు.. ఆరోగ్యంపై వదంతులు, క్లారిటీ ఇచ్చిన రెబల్‌స్టార్ కార్యాలయం
Send us your feedback to audioarticles@vaarta.com
సీనియర్ నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరారు. సోమవారం సాయంత్రం కృష్ణంరాజు తమ ఇంటిలో ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడిపోగా.. ఈ ప్రమాదంలో ఆయన తుంటికి ఫ్రాక్చర్ అయినట్లుగా మీడియాలో విస్తృతంగా కథనాలు వెలువడ్డాయి. అపోలో వైద్యులు మంగళవారం ఉదయం తుంటికి శస్త్రచికిత్స చేశారని.. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు ఆ వార్తల సారాంశం.
అయితే ఈ వార్తలపై కృష్ణంరాజు కార్యాలయం స్పందించింది. ఆయన ఆరోగ్యం బాగుందని.. కేవలం రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసమే ఆయన అపోలోకి వచ్చినట్లు ఆయన కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే రోడ్డు ప్రమాదంలో గాయపడిన మెగా హీరో సాయిధరమ్ తేజ్ కుటుంబ సభ్యులతో అతని ఆరోగ్య పరిస్థితిపై కృష్ణంరాజు ఆరా తీసినట్లు వెల్లడించింది. సాయితేజ్ త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను అని కృష్ణంరాజు చెప్పారు. త్వరలో యూకే వెళ్లాల్సి ఉన్నందున రొటీన్ హెల్త్ చెకప్ చేసుకోవడానికి అపోలోకి వచ్చినట్లు ఆయన కార్యాలయం స్పష్టం చేసింది.
కాగా , ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబులు తెలుగు సినిమాను ఏలుతున్న రోజుల్లో తనదైన నటన, మేనరిజంతో రెబల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు కృష్ణంరాజు. 1966లో చిలకా గోరింక చిత్రం ద్వారా ఆయన సినీ అరంగేట్రం చేశారు. తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో 183 సినిమాల్లో నటించి మెప్పించారు. జీవన తరంగాలు, కృష్ణవేణి, భక్త కన్నప్ప, అమరదీపం, సతి సావిత్రి, కటకటాల రుద్రయ్య, మన ఊరి పాండవులు, బొబ్బిలి బ్రహ్మన్న, మరణ శాసననం, అంతిమ తీర్పు, పల్నాటి పౌరుషం తదితర చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చాయి. మూడుసార్లు నంది అవార్డులు, ఐదుసార్లు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకున్నారు.
సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ కృష్ణంరాజు సత్తా చాటారు. 1990వ దశకంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరి కీలకంగా వ్యవహరించారు. బీజేపీ టికెట్‌పై రెండు సార్లు (కాకినాడ, నర్సాపూర్ నియోజకవర్గాల నుంచి) లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1999-2004 మధ్యకాలంలో అటల్ బిహారి వాజ్‌పేయి కేబినెట్లో కేంద్ర విదేశాంగ వ్యవహారాల సహాయ మంత్రిగా కృష్ణంరాజు సేవలందించారు. అనంతరం 2009లో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజరాజ్యం పార్టీలో చేరారు చిరు. అయితే నాటి ఎన్నికల్లో ఓటమి తర్వాత క్రమంగా క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నారు కృష్ణంరాజు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments