మరణానంతరం నా అవయవాలు దానం చేస్తా.. పుట్టినరోజు నాడు జగపతిబాబు కీలక ప్రకటన
- IndiaGlitz, [Saturday,February 12 2022]
అవయవదానం.. తాను చనిపోతూ మరో నలుగురి జీవితాల్లో వెలుగులు నింపే ఓ మహత్తర కార్యక్రమం. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థల కృషి కారణంగా ఇప్పుడిప్పుడే అవయవదానంపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. గుండె, కిడ్నీలు, లివర్, కళ్లు, ఎముక మజ్జ వంటి అతి ముఖ్యమైన భాగాలను దానం చేయడం ద్వారా నలుగురిని కాపాడటమే కాకుండా మరణించి కూడా మనం బతికినట్లే. ఈ విషయాన్ని పాటిస్తూ కొందరు వ్యక్తులు ధన్య జీవులుగా మిగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ సినీనటుడు జగపతి బాబు.. తన పుట్టినరోజును పురస్కరించుకుని కీలక నిర్ణయం తీసుకున్నారు.
తన మరణానంతరం తాను అవయవదానం చేయనున్నట్లు జగపతి బాబు ప్రతిజ్ఞ చేశారు. రేపు ఆయన 60వ వసంతంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో జరిగిన కార్యక్రమంలో జగపతి బాబు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పుట్టినరోజు సందర్భంగా పది మందికీ ఉపయోగపడే కార్యక్రమం చేయాలనుకున్నానని చెప్పారు. అవయవదానానికి సంబంధించిన ప్రతిజ్ఞ అయితే పలువురిలో స్ఫూర్తి కలిగిస్తుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు జగపతిబాబు వెల్లడించారు. అవయవదానం వల్ల అవి అవసరమైన వారికి లభించి.. వారికి కొత్త జీవితం లభిస్తుందని ఆయన చెప్పారు. తన అభిమానులంతా అవయవదానం చేయడానికి ముందుకురావాలని ఈ సందర్భంగా జగపతి పిలుపునిచ్చారు.
అనంతరం కిమ్స్ ఆసుపత్రి ఛైర్మన్ డాక్టర్ బొల్లినేని భాస్కరరావు మాట్లాడుతూ.. కొవిడ్ సమయంలో ఆసుపత్రిలో చేరిన ఎంతో మంది పేద సినీ కార్మికులకు జగపతి బాబు ఆసుపత్రి బిల్లులు చెల్లించారని తెలిపారు. తన అభిమాన నటుడైన జగపతిబాబు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఎంతో సాహసోపేతమని, ఆయన స్ఫూర్తితో మరింతమంది ముందుకు రావాలని భాస్కరరావు విజ్ఞప్తి చేశారు.