Costume Krishna: టాలీవుడ్‌లో మరో విషాదం.. నిర్మాత, నటుడు కాస్ట్యూమ్ కృష్ణ కన్నుమూత
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు నెలకొంటున్నాయి. ఇప్పటికే కే విశ్వనాథ్, జమున, సాగర్, తారకరత్న మరణాలతో చిత్ర పరిశ్రమ శోకసంద్రమైన సంగతి తెలిసిందే. వీటి నుంచి తేరుకోకముందే మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు, నిర్మాత క్యాస్ట్యూమ్ కృష్ణ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఆదివారం చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు సంతానం. కాస్ట్యూమ్ కృష్ణ మరణవార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
కాస్ట్యూమ్ కృష్ణ ప్రస్థానం :
కాస్ట్యూమ్ కృష్ణ అసలు పేరు మాదాసు కృష్ణ. విజయనగరం జిల్లా లక్కవరపు కోటలో ఆయన జన్మించారు. తొలుత కాస్ట్యూమ్ డిజైనర్‌గా చిత్ర పరిశ్రమలో తన ప్రస్థానం ప్రారంభించారు. మహానటులు ఎన్టీఆర్ , ఏఎన్నార్, కృష్ణలతో పాటు చిరంజీవి, బాలకృష్ణ, వాణిశ్రీ, జయసుధ, శ్రీదేవి, జయప్రద వంటి స్టార్స్‌కు ఆయన కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారు. అన్న నందమూరి తారకరామారావు వేసుకునే బెల్ బాటమ్ ప్యాంట్స్‌ను తీసుకొచ్చిన ఘనత ఆయనదే. అయితే ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ ఈయన జీవితాన్ని మలుపు తిప్పారు. కృష్ణలోని నటుడిని గుర్తించింది ఆయనే. కోడి రామకృష్ణ బలవంతం మీద ‘‘భారత్ బంద్’’లో విలన్ పాత్ర పోషించి ప్రేక్షకులను మెప్పించారు. ఆ తర్వాత వరుసపెట్టి కాస్ట్యూమ్ కృష్ణను ఆఫర్లు వెతుక్కుంటూ వచ్చాయి. పెళ్లాం చెబితే వినాలి, కొండపల్లి రాజా, అల్లరి మొగుడు, దేవుళ్లు, మా ఆయన బంగారం, విలన్, పుట్టింటికి రా చెల్లి వంటి సినిమాలు నటుడిగా ఆయనకు మంచి పేరు తీసుకొచ్చాయి.
నిర్మాతగా నష్టపోయిన కాస్ట్యూమ్ కృష్ణ :
కాష్ట్యూమ్ డిజైనర్‌గా బిజీగా ఉన్న సమయంలోనే సూపర్ స్టార్ కృష్ణ హీరోగా విజయ శాంతి హీరోయిన్‌గా బి.గోపాల్ దర్శకత్వంలో ‘అశ్వధ్ధామ’ చిత్రాన్ని నిర్మించారు. అలా నిర్మాతగా 8 సినిమాలు తెరకెక్కించారు. అనంతర కాలంలో సినిమాల్లో నష్టాలు, ఆరోగ్యం సహకరించకపోవడం, వయో భారం తదితర కారణాలతో కాస్ట్యూమ్ కృష్ణ చిత్ర పరిశ్రమకు దూరంగా వుంటూ వస్తున్నారు. అంతేకాదు.. తనను కొందరు ఇండస్ట్రీవాళ్లే మోసం చేసినట్లు కొద్దిరోజుల క్రితం కాస్ట్యూమ్ కృష్ణ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఏది ఏమైనా కాస్ట్యూమ్ డిజైనర్‌గా పరిశ్రమలో అడుగుపట్టి.. ఆపై నిర్మాతగా, నటుడిగా తనదైన శైలిలో ఆయన ప్రేక్షకులను అలరించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments