Chalapati Rao: రోజుల వ్యవధిలో మరో విషాదం... నటుడు చలపతిరావు కన్నుమూత, షాక్‌లో టాలీవుడ్
- IndiaGlitz, [Sunday,December 25 2022]
2022వ సంవత్సరం తెలుగు చిత్ర పరిశ్రమకు చేదు జ్ఞాపకాలను మిగులుస్తోంది. ఒకరి వెంట ఒకరిని సినీ దిగ్గజాలను తనతో పాటు తీసుకుపోతోంది. ఇప్పటికే కృష్ణ, కృష్ణంరాజులు కన్నుమూయగా... నిన్న గాక మొన్న నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ మనందరినీ విడిచి వెళ్లిపోయారు. ఈ విషాదం నుంచి కోలుకోకముందే టాలీవుడ్‌కు మరో షాక్ తగిలింది. సీనియర్ నటుడు చలపతిరావు ఇకలేరు. ఆయన వయసు 78 సంవత్సరాలు. హైదరాబాద్‌లోని తన నివాసంలో చలపతిరావు గుండెపోటుతో కన్నుమూశారు. విషయం తెలుసుకున్న పలువురు సీని ప్రముఖులు చలపతిరావు (Chalapathi Rao) మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు.
ఇది చలపతిరావు (Chalapathi Rao)ప్రస్థానం:
1944 మే 8న కృష్ణా జిల్లా పామర్రు మండలం బల్లిపర్రులో జన్మించారు చలపతిరావు. సినిమాలపై ఆసక్తితో మద్రాసు వెళ్లిన ఆయన ఎన్టీఆర్ అడుగుజాడల్లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 1966లో సూపర్‌స్టార్ కృష్ణ హీరోగా తెరకెక్కిన ‘‘గూఢచారి 116’’ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా బిజీ అయిపోయారు. సుదీర్ఘ కెరీర్‌లో 1200కు పైగా సినిమాల్లో చలపతిరావు నటించారు. మూడు తరాల నటులతో కలిసి నటించిన అరుదైన ఘనత ఆయన సొంతం. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజులతో పాటు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున , వెంకటేశ్‌లతో పాటు వారి వారసులతోనూ చలపతి రావు స్క్రీన్ షేర్ చేసుకున్నారు. చివరిసారిగా నాగార్జున, నాగచైతన్య నటించిన బంగార్రాజు ఆయన చివరి చిత్రం.
నిర్మాతగానూ వ్యవహరించిన చలపతిరావు (Chalapathi Rao) :
కలియుగ కృష్ణుడు, కడప రెడ్డమ్మ, జగన్నాటకం, పెళ్లంటే నూరేళ్ల పంట తదితర చిత్రాలకు చలపతిరావు నిర్మాతగా వ్యవహరించారు. ఆయన కుమారుడు రవిబాబు నటుడు, దర్శకుడు, నిర్మాతగా సినీ పరిశ్రమలోనే కొనసాగుతున్నారు. కుమార్తె అమెరికా నుంచి వచ్చిన తర్వాత చలపతిరావు అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం వరకు సినీ ప్రముఖులు, అభిమానుల సందర్శనార్ధం చలపతిరావు భౌతికకాయాన్ని బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని రవిబాబు ఇంట్లోనే వుంచనున్నారు. అనంతరం జూబ్లీహిల్స్ మహా ప్రస్థానం ఫ్రీజర్‌లో వుంచుతామని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.